శంకర్ గేమ్ చేంజ్ చేసే ఒకే ఒక్క దారి
భారీ కాన్వాసుతో సినిమాలు తీయడం, దానికోసం అసాధారణ బడ్జెట్లను పెట్టుబడిగా పెట్టించడం శంకర్ కి తొలి నుంచి ఉన్న అలవాటు.
భారీ కాన్వాసుతో సినిమాలు తీయడం, దానికోసం అసాధారణ బడ్జెట్లను పెట్టుబడిగా పెట్టించడం శంకర్ కి తొలి నుంచి ఉన్న అలవాటు. `ది జెంటిల్‌మేన్` మొదలు అతడు తెరకెక్కించిన ప్రతి చిత్రానికి పాటలు, ఫైట్స్ సహా విజువల్ గ్రాండియారిటీ కోసం విజువల్ రిచ్ సెట్స్ నిర్మాణం, ప్రపంచంలోని ఎగ్జోటిక్ లొకేషనలు, ఏడు వింతల పరిసరాల్లో సన్నివేశాల్ని చిత్రీకరించేందుకు, వీఎఫ్.ఎక్స్ మాయాజాలం కోసం నిర్మాతలు భారీ బడ్జెట్లను ఖర్చు చేసారు.
అయితే శంకర్ నెక్ట్స్ సినిమా చేయాలంటే నిర్మాతలు నమ్మే పరిస్థితి ఉందా? అంటే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మునుపటిలా భారీ బడ్జెట్లను కేటాయించి శంకర్ తో సినిమా తీయాలంటే, ముందు అతడిని నమ్మే పరిస్థితి రావాలి. దానికోసం శంకర్ సరైన బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సి ఉంది. గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 భారీ డిజాస్టర్లుగా మారడంతో ఇప్పుడు శంకర్ ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
అయితే సుదీర్ఘ కాలంగా శంకర్ భారీ తనం నిండిన సినిమాలకు పని చేసారు. ఇలాంటి సమయంలో అతడు బ్లాక్ బస్టర్ ని, చాలా తక్కువ బడ్జెట్ తోనే సాధించాలి. అయితే చిన్న బడ్జెట్ సినిమాని వీఎఫ్ ఎక్స్- గ్రాఫిక్స్ ఉపయోగించని సినిమాని ఆయన చేస్తారా? అంటే సందిగ్ధత కనిపిస్తోంది. శంకర్ తెరకెక్కించిన తదుపరి చిత్రం భారతీయుడు 3 (ఇండియన్ 3 ) విడుదలకు వస్తుంది. కానీ భారతీయుడు 2 ఫ్లాప్ కారణంగా దీనిపై ఆ ప్రభావం ఎలా ఉంటుందోననే సందేహాలున్నాయి.
అయితే శంకర్ లాంటి దర్శకుడు ఎక్కడ తప్పు చేస్తున్నారు? అంటే.. ఎంపిక చేసుకునే కథాంశం, స్క్రిప్టు మ్యాటర్ లోనే ప్రాబ్లెమా? లేక దర్శకుడిగా ఆయన ఆలోచనా విధానం ఆశించిన రేంజుకు రీచ్ కావడం లేదా? అన్నదానిని విశ్లేషిస్తున్నారు. భారీ ఫ్లాపులొచ్చినా కానీ, శంకర్ పై అభిమానం ఇంకా చావడం లేదు. అతడు ఏదో ఒక రోజు మ్యాజిక్ చేస్తాడని ఆశించే వీరాభిమానులున్నారు. శంకర్ స్వయంగా రాసుకున్న స్క్రిప్టులేవీ ఇటీవల తెరకెక్కించడం లేదు. 2.0 కి తమిళ రచయిత, జర్నలిస్ట్ జేయ మోహన్ స్క్రిప్టు అందించగా, భారతీయుడు 2 కి జేయ మోహన్ తో పాటు ఇతరులు పని చేసారు. గేమ్ ఛేంజర్ కి కార్తీక్ సుబ్బరాజు స్క్రిప్టును అందించారు. కానీ ఇవేవీ వర్కవుట్ కాలేదు. ఇలాంటి సమయంలో శంకర్ కి తిరిగి తన తొలి నాళ్లలో సహకరించిన లెజెండరీ రచయిత, ది గ్రేట్ సుజాత రంగరాజన్ సాయం అవసరమని భావిస్తున్నారు. కానీ సుజాత రంగరాజన్ శంకర్ తెరకెక్కించిన చివరి బ్లాక్ బస్టర్ `రోబో` చిత్రీకరణ సమయంలోనే మరణించారు. సుజాత రంగరాజన్ నవలా రచయిత, సైంటిస్ట్, సైన్స్ ఫిక్షన్ నిపుణుడు, గొప్ప సినీరచయిత. అందువల్ల `జెంటిల్ మేన్ నుంచి రోబో` వరకూ అన్ని సినిమాలకు ఆయన అందించిన స్క్రిప్టులు గొప్పగా వర్కవుట్ అయ్యాయి. కానీ ఆయన నిష్కృమించిన తర్వాత శంకర్ కి ఏదీ కలిసి రాలేదు. వరుసగా అన్ని చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకే ఇప్పుడు సుజాత రంగరాజన్ లాంటి మరో రచయిత పుట్టుకొస్తేనే శంకర్ కి తిగిరి మునుపటిలా విజయాలు దక్కుతాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.