భోలా శంకర్ దర్శకుడిగా నాకు పునర్జన్మ: మెహర్ రమేష్
కొన్ని వరుస పరాజయాలతో దర్శకుడిగా కెరీర్ పరంగా వెనకబాటులో ఉన్నారు మెహర్ రమేష్
కొన్ని వరుస పరాజయాలతో దర్శకుడిగా కెరీర్ పరంగా వెనకబాటులో ఉన్నారు మెహర్ రమేష్. ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాతో తిరిగి దర్శకుడిగా అవకాశం అందుకున్నారు. ఈ చిత్రం వేదాళం చిత్రానికి అధికారిక రీమేక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెహర్ రమేష్ మాట్లాడుతూ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించడం తన అదృష్టమని అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ - ''దర్శకుడిగా భోలా శంకర్ నాకు పునర్జన్మ. ఈ అవకాశం కల్పించింది అన్నయ్య (చిరు). అనిల్ సుంకర ప్యాషనేట్ ప్రొడ్యూసర్.. భోళా శంకర్‌కి పనిచేసిన వారందరూ మెగాస్టార్ అభిమానులే''నని మెహర్ రమేష్ పేర్కొన్నారు. మెహర్ తన ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. తనకు అవకాశం ఇచ్చినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.
చిరుకు పాజిటివిటీ, ప్రేమను పంచడం మాత్రమే తెలుసునని మెహర్ రమేష్ అన్నారు. చిరంజీవి వినోద చక్రవర్తి అని ఆగస్టు 11 నుండి థియేటర్లలో అభిమానుల సందడి ఉంటుందని మెహర్ రమేష్ అన్నారు.. మెగా ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందని దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. కీర్తి తనను అన్నయ్య అని పిలుస్తుందని ఒక మంచి సిస్టర్ ని సంపాదించుకున్నానని కూడా మెహర్ అన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి పెళ్లి సమయంలో తాను మద్రాసుకు వెళ్లానని మెహర్ నాటిరోజులను గుర్తు చేసుకున్నారు. మెగా కుటుంబంతో తనకు ఎక్కడో రిలేషన్ షిప్ ఉందన్నది ఎప్పటికీ తనకు ఆనందాన్నిస్తుందని కూడా మెహర్ ఈ వేదికపై వెల్లడించారు. మెగాస్టార్ ప్రోత్సాహంతోనే తాను దర్శకుడిని అయ్యానని కూడా తెలిపారు. షాడోగా ఉన్న నాపై మెగాస్టార్ వెలుగులు ప్రసరించారని కూడా అన్నారు.