ఇంట్రెస్టింగ్.. కాపీకి కాపీయే సమాధానమా?
దర్శకరచయితలు కొన్ని సన్నివేశాలు లేదా సీన్లను నేరుగానే లిఫ్ట్ చేసారని విమర్శలున్నాయి.
భారతీయ సినీపరిశ్రమల్లో చాలా సినిమాలకు హాలీవుడ్ స్ఫూర్తి ఉంది. హాలీవుడ్ నుంచి చాలా యాక్షన్ సినిమాలు, హారర్ సినిమాలు, రొమాంటిక్ డ్రామాలను హిందీ చిత్రసీమ కాపీ చేసింది. కేవలం హిందీ పరిశ్రమ మాత్రమే కాదు.. సౌతిండియాలో చాలా తెలుగు, తమిళ చిత్రాలకు హాలీవుడ్ నుంచి స్ఫూర్తి ఉంది. దర్శకరచయితలు కొన్ని సన్నివేశాలు లేదా సీన్లను నేరుగానే లిఫ్ట్ చేసారని విమర్శలున్నాయి.
కాపీ కొట్టడం లేదా ప్రేరణ చెందడం అన్నది చాలా సర్వసాధారణమైనది. ఆసక్తికరంగా తమ సినిమాలను తామే కాపీ కొట్టి కొత్త సీన్లు రాసే డైరెక్టర్లు కూడా మనకు ఉన్నారు. చాలా మంది రచయితలు తెలుగు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కొత్త కథలు రాసుకునేవారు లేకపోలేదు.
అదంతా అటుంచితే ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి తాను తెలుగు సినిమాలను కాపీ చేసి తమిళంలో సినిమాలు తెరకెక్కించానని అన్నారు. అంతేకాదు.. చాలా తెలుగు సినిమాల కోసం తన సినిమాలను కాపీ చేసారని కూడా ఆరోపించారు. తాను తెరకెక్కించిన సినిమాల నుంచి నేరుగా కొన్ని సీన్లను ఎత్తేసారని కూడా అన్నారు. దాంతో నిరాశ చెందిన తాను కూడా తెలుగు సినిమాల నుంచి కాపీ కొట్టానని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. కాపీకి కాపీయే సమాధానమా? అంటే దానికి అతడి నుంచి సమాధానం రావాల్సి ఉంది.
దర్శకుడు సుందర్ సి నటించి, రూపొందించిన `అరణ్మనై 4` ఈరోజు తెలుగులో `బాక్` పేరుతో విడుదలైంది. ఇది హారర్ కామెడీ జానర్ లో రూపొందించిన సినిమా. ఇందులో తమన్నా -రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించారు. ప్రమోషన్స్ కోసం గ్లామరస్ నాయికలతో అద్భుతమైన ప్రచార గీతాన్ని కూడా తెరకెక్కించి రిలీజ్ చేసారు. అయితే బాక్ మూవీ కోసం సుందర్ సి ఏ తెలుగు సినిమాని కాపీ చేసారో వెల్లడించలేదు. తాను కాపీ చేసిన ఏ తెలుగు సినిమా గురించి కూడా ఎక్కడా రివీల్ చేయలేదు. అలాగే తన సినిమాల నుంచి తెలుగు డైరెక్టర్లు కాపీ చేసారని ఆరోపించిన ఆయన ఫలానా సినిమా నుంచి కాపీ చేసారని కూడా స్పష్ఠంగా చెప్పనేలేదు. సుందర్ సి నటి ఖుష్బూ భర్త. దశాబ్ధాలుగా సినీపరిశ్రమలో ఆయన అనుభవజ్ఞుడు.