డిస్నీని అమ్మేయడం లేదు!
అయితే అంతర్జాతీయ దిగ్గజం డిస్నీ భారతదేశంలో తన ఓటీటీ వ్యాపారాన్ని విస్తరించే పనిలో భాగంగా స్టార్ ఇండియా- హాట్ స్టార్ తో జత కట్టింది.
ఓటీటీ దిగ్గజాల నడుమ ఠఫ్ కాంపిటీషన్ గురించి తెలిసిందే. ఒరిజినల్ క్రియేటివ్ కంటెంట్ ని సృష్టిస్తూ ఎవరికి వారు ఈ రంగంలో ఏలేందుకు భారీ పెట్టుబడులను వెదజల్లుతున్నారు. కానీ ఇక్కడ సక్సెస్ సాధించేది కొందరు మాత్రమే. అయితే అంతర్జాతీయ దిగ్గజం డిస్నీ భారతదేశంలో తన ఓటీటీ వ్యాపారాన్ని విస్తరించే పనిలో భాగంగా స్టార్ ఇండియా- హాట్ స్టార్ తో జత కట్టింది. భారతదేశంలో అత్యంత వేగంగా పురోగతి సాధించిన ఓటీటీగా హాట్ స్టార్ కి గుర్తింపు ఉంది. నిజానికి అమెజాన్ ప్రైమ్ కంటే వేగంగా ఎదిగిన ఓటీటీ సంస్థ ఇది.
అయితే ఏడాది క్రితం హాట్ స్టార్ 61.3 మిలియన్ల చెల్లింపు చందాదారులనుంచి, గణనీయంగా 37.6 మిలియన్లకు తగ్గిపోవడం ఆశ్చర్యపరిచింది. జియో సినిమా నుంచి పోటీ నేపథ్యంలో హాట్ స్టార్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. అదే సమయంలో సదరు ఓటీటీని రిలయన్స్ కొనుగోలు చేయనుందన్న ప్రచారం మొదలైంది. భారతదేశంలో డిస్నీ ఇక ఉండదు అని కూడా ప్రచారమైంది. కంపెనీ తన ఇండియా వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తోందని రిలయన్స్ ఈ ప్రతిపాదన కోసం 10 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు కథనాలొచ్చాయి.
అయితే ఇప్పుడు అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ క్లారిటీనిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాము భారత్‌లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. కంపెనీ తమకు అందుబాటులో ఉన్న అన్ని ఎదుగుదల అవకాశాలను అంచనా వేస్తోందని, భారత్‌లో వ్యాపారం కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. డిస్నీ తన లీనియర్ టెలివిజన్ వ్యాపారమైన స్టార్ ఇండియాతో మంచి పనితీరును కనబరుస్తోంది. స్టార్ ఇండియా డిస్నీకి లాభదాయకమైన వ్యాపారంగా ఉంది. కంపెనీకి వచ్చిన నష్టాలు వ్యాపారంలోని ఇతర భాగాల నుండి వస్తున్నాయని కూడా కనుగొన్నారు.
రిలయన్స్ అధినేతల బిగ్ ప్లాన్స్ ఇతర సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ రంగంలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. జియోసినిమా ప్రభావంతో హాట్ స్టార్ సబ్‌స్క్రైబర్ సంఖ్య తగ్గింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హక్కులు, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంటెంట్ ఇష్యూస్ తో కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ, అమ్మకానికి రెడీ అయిపోయేంత ముప్పు హాట్ స్టార్ కి లేదు. అయితే ఇలాంటి పరస్థితుల్లో కంపెనీకి కొద్దిగా పునర్నిర్మాణం అవసరమని ఇక్కడ ఎదగడం ముఖ్యమని బాబ్ ఇగెర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వారు అందుకోగలిగే అతిపెద్ద మార్కెట్... అని కూడా ఆయన విశ్లేషించారు. ఎలాగైనా పోటీలో నిలబడేందుకు బాబ్ ఇగెర్ తనదైన శైలిలో ప్రయత్నాల్లో ఉన్నారు. హాట్ స్టార్ మునుముందు బలమైన కంటెంట్ తో భారతీయ మార్కెట్లో మరింతగా దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.