అగ్ర నిర్మాతతో నటి మాటల యుద్ధం పీక్స్
పరిశ్రమను శాసించే అగ్రనిర్మాతతో పాపులర్ హీరోయిన్ (ప్రముఖ నిర్మాత భార్య కూడా) మాటల యుద్ధానికి దిగింది.
పరిశ్రమను శాసించే అగ్రనిర్మాతతో పాపులర్ హీరోయిన్ (ప్రముఖ నిర్మాత భార్య కూడా) మాటల యుద్ధానికి దిగింది. ఇది సోషల్ మీడియా వేదికగా సాగినా కానీ ఎంతమాత్రం క్షిపణి దాడికి తక్కువేమీ కాదు. నువ్వెంత అంటే నువ్వెంత! అన్న తీరుగా సాగింది ఈ మాటల యుద్ధం. ఇద్దరి మధ్యా వార్ ఇరాన్ పై ఇజ్రాయేల్ దాడిలా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ గొడవ వివరాల్లోకి వెళితే....
ఈ ఎపిసోడ్ లో అగ్ర నిర్మాత మరెవరో కాదు..బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్. అతడితో తలపడిన కథానాయిక మరెవరో కాదు, అదే పరిశ్రమకు చెందిన మరో హిందీ అగ్రనిర్మాత టి.సిరీస్ భూషణ్ కుమార్ భార్య, హీరోయిన్ దివ్య ఖోస్లా కుమార్. దివ్య ఖోస్లా అందమైన నటి మాత్రమే కాదు... సమయం సందర్భం వస్తే ఎంతటి వారికైనా చెంప చెల్లుమనిపించే సమాధానం ఇవ్వగలదని ఇప్పుడు కరణ్ జోహార్‌తో యుద్ధం క్లియర్ కట్ గా తేల్చి చెప్పింది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్యా గొడవేంటి అంటే...?
ఇటీవలే కరణ్ జోహార్ నిర్మించిన జిగ్రా థియేటర్లలో విడుదలై సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు నటించిన `విక్కీ విద్యా కా వో వాలా వీడియో` చిత్రంతో పోటీపడుతూ ఇది థియేటర్లలో విడుదలైంది. అయితే తాను జిగ్రా సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్లానని, కానీ థియేటర్లలో ఈగల మోత తప్ప ఇంకేమీ లేదని వ్యాఖ్యానించింది దివ్యా ఖోస్లా కుమార్. థియేటర్ అంతా ఖాళీగా ఉందని, కానీ మొదటిరోజు జిగ్రా 4.5 కోట్లు ఎలా వసూలు చేసింది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆలియాభట్- కరణ్ జోహార్ లెక్కల్ని మ్యానిప్యులేట్ చేసారని ఎవరి పేర్లు పెట్టకుండానే విమర్శించింది.
అయితే దీనికి కరణ్ జోహార్ నొచ్చుకోవడమే కాదు.. సూటిగా కౌంటర్ వేసాడు. ఆదివారం నాడు సోషల్ మీడియాల్లో ఒకరి పేరు ఒకరు ప్రస్థావించకుండా ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు.. తిట్టుకున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కరణ్ తన ఇన్‌స్టాలో ఇలా వ్యాఖ్యానించారు. ``మూర్ఖులకు మీరు ఇచ్చే ఉత్తమ ప్రసంగం నిశ్శబ్దం`` అని రాశారు. అయితే దీనికి దివ్య తన ఇన్‌స్టా లో ఒక కోట్‌ను షేర్ చేస్తూ బదులిచ్చారు. ``నిజం ఎప్పుడూ దానిని వ్యతిరేకించే మూర్ఖులను బాధపెడుతుంది`` అని రాసింది. అంతేకాదు తన వాయిస్ అంతగా వినిపించలేదని భావించిన దివ్య ఖోస్లా అదే సామాజిక మాధ్యమాల్లో ఇలా రాసింది. ``మీరు ఇతరులకు హక్కుగా ఉన్న దానిని దొంగిలించడానికి సిగ్గులేకుండా అలవాటు పడ్డప్పుడు.. మీరు ఎల్లప్పుడూ మౌనాన్ని ఆశ్రయిస్తారు. నీకు స్వరం ఉండదు.. వెన్నెముక ఉండదు`` అని స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
ఆసక్తికరంగా జిగ్రా కథతో దివ్యా ఖోస్లా నటించిన సావి కథ సమాంతరంగా ఉంటుంది. జిగ్రాలో తమ్ముడిని ఒక పెద్ద ప్రమాదం నుంచి, జైలుకు వెళుతున్న వాడిని కాపాడే అక్క కథను తెరపై చూపించగా, సావిలో జైలు శిక్ష అనుభవిస్తున్న భర్తను విడిపించడానికి పోరాడే భార్య కథను తెరపై చూపించారు. అయితే ఆలియా పూర్తి నిడివి పాత్రలో నటించగా, సావిలో అంతంత మాత్రంగా కనిపించే పాత్రలో దివ్య ఖోస్లా కనిపించింది. అయితే దివ్య ఇలా కరణ్ - ఆలియా జోడీ సినిమాపై దాడికి దిగడానికి కారణం తన భర్త భూషణ్ కుమార్ నిర్మించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో పోటీపడుతూ జిగ్రా విడుదల కావడమేనని విశ్లేషిస్తున్నారు. అయితే జిగ్రా నటి ఆలియా భర్త రణబీర్ తో భూషణ్ కుమార్ భారీ పాన్ ఇండియన్ చిత్రాలను నిర్మిస్తున్నారు. యానిమల్ తర్వాత యానిమల్ 2 కోసం రణబీర్ తో భూషణ్ జీ పని చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వారి మధ్య సంబంధాలను దివ్యా ఖోస్లా నాశనం చేస్తోందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.