ఖాన్‌ల త్ర‌యాన్ని మించిన తెర వెన‌క స్టార్!

అదంతా అటుంచితే ఆస్తి ఐశ్వ‌ర్యంలో ఖాన్ ల త్ర‌యం ఎప్పుడూ స్కైలోనే ఉంది.

Update: 2024-08-31 03:52 GMT

బాలీవుడ్‌ని ఖాన్‌ల త్ర‌యం ఏల్తుంద‌నేది అంద‌రి అభిప్రాయం. బ‌చ్చ‌న్ లు, క‌పూర్ లు గొప్ప ధ‌న‌వంతులు అని కూడా భావిస్తుంటారు. కానీ ఇటీవ‌ల సౌతిండియా నుంచి పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు రావ‌డం ఖాన్‌ల ప్ర‌భ‌ను మ‌స‌క‌బారేలా చేస్తోంది. హిందీ తార‌లను ఢీకొట్టే స‌త్తా త‌మ‌కు ఉంద‌ని సౌత్ స్టార్లు నిరూపిస్తున్నారు. చెప్పుకోవ‌డానికి ఇది ఎంత‌మాత్రం అతిశ‌యోక్తి కాదు. 1000 కోట్ల క్ల‌బ్‌లతో మ‌న‌వాళ్లు దుమ్ము దులిపేస్తున్నారు. అదంతా అటుంచితే ఆస్తి ఐశ్వ‌ర్యంలో ఖాన్ ల త్ర‌యం ఎప్పుడూ స్కైలోనే ఉంది. ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో హీరోలుగా, నిర్మాత‌లుగా భారీగా ఆదాయాల్ని ఆర్జించారు.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురి నిక‌ర ఆస్తుల విలువ చాలా ఎక్కువ‌. అయితే వారికి ఎంతగా ఆస్తులు విస్త‌రించి ఉన్నా.. వారిని మించిన స్టార్ ఒక‌రు బాలీవుడ్ లో ఉన్నార‌ని చ‌ర్చ సాగుతోంది. ఖాన్ ల త్ర‌యం నికర ఆస్తులన్నిటి విలువ కంటే చాలా ఎక్కువ ఆస్తులు క‌లిగి ఉన్న బాలీవుడ్ ప్ర‌ముఖుడు రోనీ స్క్కూవాలా. దాదాపు రూ. 13,000 కోట్లకు పైగా ఆస్తుల‌తో అత‌డు బాలీవుడ్‌లోని ఏకైక బిలియనీర్ గా రికార్డుల‌కెక్కాడు.

బాలీవుడ్‌లో ప‌లువురు స్టార్లు ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ. 100 కోట్లకు పైగా సంపాదిస్తే, కరణ్ జోహార్ వంటి కొందరు దర్శకులు సినిమా సామ్రాజ్యాలను నిర్మించారు. హిందీ వినోద‌పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రముఖులందరిలో ఒక బిలియనీర్ మాత్రమే ఉన్నాడు. అతడు రోనీ మాత్ర‌మే. రోనీ స్క్రూ వాలా నటుడు లేదా ద‌ర్శ‌కుడు కానేకాదు. అతను ఒక సినీ నిర్మాత.. వ్యాపారవేత్త! సంపద పరంగా బాలీవుడ్ లో చాలామంది దిగ్గ‌జాల‌ను అధిగమించాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురి ఆస్తులు క‌లిపినా అంత‌కుమించి అత‌డి నిక‌ర ఆస్తి విలువ ఉంది. దాదాపు రూ. 13,000 కోట్లకు పైగా నిక‌ర ఆస్తులు ఉన్న బాలీవుడ్‌లోని ఏకైక బిలియనీర్ అత‌డు. ప్ర‌ఖ్యాత డిఎన్ఏ క‌థ‌నం ప్రకారం.. రోనీ స్క్రూవాలా నికర ఆస్తి విలువ 13012 కోట్లు (1.55 బిలియన్ల డాల‌ర్లు) ఉంటుంద‌ని అంచ‌నా. సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లు, అమీర్ ఖాన్ రూ. 1,900 కోట్లు, షారూఖ్ ఖాన్ రూ. 6,600 కోట్లు నిక‌ర ఆస్తులు క‌లిగి ఉన్నారు. వీట‌న్నిటినీ క‌లిపినా రోనీ ఆస్తులు అంత‌కుమించి అనేలా ఉన్నాయి. ప్రముఖ నటుల సంపదల‌ను అత‌డు అధిగమించడం గమనించదగ్గ విషయం. అపారమైన సంపద గొప్ప వ్యాపార సామ్రాజ్యంతో రోనీ స్క్రూవాలా హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న వ్యక్తిగా పాపుల‌ర‌య్యాడు.

సినీ కెరీర్ మొత్తంలో స్క్రూవాలా తన సొంత‌ బ్యానర్ RSVP మూవీస్, UTV ఫిల్మ్స్ బ్యాన‌ర్ల‌లో అనేక ప్రాజెక్ట్‌లను నిర్మించారు. సామ్ బహదూర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు కెరీర్ లో ఉన్నాయి. జోధా అక్బర్, కేదార్ నాథ్ లాంటి సినిమాల‌ను అత‌డు నిర్మించారు. వాస్తవానికి కేవలం రూ. 37,500 పెట్టుబడితో UTV ఫిల్మ్స్‌ను స్థాపించాడు. తరువాత కంపెనీని 2012లో 454 మిలియన్ల డాల‌ర్ల‌కు (సుమారు రూ. 3,750 కోట్లు) వాల్ట్ డిస్నీకి విక్రయించాడు. సినీ వ్యాపార‌ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు రోనీ స్క్రూవాలా లేజర్ బ్రషెస్ అనే టూత్ బ్రష్ తయారీ కంపెనీని స్థాపించడం ద్వారా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేశంలో కేబుల్ టీవీ వృద్ధికి ఆయన చేసిన కృషికి మంచి పేరు వ‌చ్చింది. 2015లో రోనీ స్క్రూవాలా.. స‌హ‌చ‌రులు మయాంక్ కుమార్, ఫాల్గుణ్ కొంపల్లితో కలిసి అప్‌గ్రాడ్ కంపెనీని స్థాపించారు. న్యూస్ 18 వివ‌రాల‌ ప్రకారం.. ఈ ఎడ్-టెక్ కంపెనీ 2022లో రూ. 300 కోట్లకు హరప్పా ఎడ్యుకేషన్‌ను కొనుగోలు చేసింది. దీని విలువ ప్రస్తుతం సుమారు సుమారు రూ. 18,650 కోట్లు(2.25 బిలియన్ డాల‌ర్లు). సంవత్సరాలుగా స్క్రూవాలా తన సంపదను యుస్పోర్ట్స్ - యున‌లైజ‌ర్ వంటి వివిధ కంపెనీలలో పెట్టుబడి పెట్టాడు.

దాతృత్వంలోను రోనీ ముందున్నాడు. రోనీ స్క్రూవాలా అతడి భార్య జరీనా స్క్రూవాలా `ది స్వదేస్` ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది సమాజంలోని అణగారిన వర్గాలను ఉద్ధరించే లక్ష్యంతో ప‌ని చేస్తోంది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో నీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను మెరుగుపరచడానికి కూడా ఫౌండేషన్ పనిచేస్తుంది. క‌నిపించ‌ని ధాతృసేవ‌లు చేసేందుకు రోనా స్క్రూవాలా ఎప్ప‌డూ సిద్ధంగా ఉంటారు.

Tags:    

Similar News