ఠాగూర్ స‌న్నివేశం డాక్ట‌ర్ల‌ను నాశ‌నం చేసింది: డా.గురువారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఠాగూర్` 2003లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-20 10:38 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఠాగూర్` 2003లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ర‌చ‌యిత ఏ.ఆర్.మురుగ‌దాస్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ సార్వ‌జ‌నీన అంశంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఠాగూర్ తమిళ చిత్రం `రమణ`కు రీమేక్. ఏ.ఆర్ మురుగదాస్ ర‌మ‌ణ‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, తెలుగు వెర్షన్ కి వివి వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే దాదాపు రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి ఠాగూర్ గురించిన ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేపారు ప్ర‌ముఖ వైద్యులు, కిమ్స్- స‌న్ షైన్ ఆస్ప‌త్రి MD డా.గురువారెడ్డి.

ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశం వైద్యుల‌కు కంటిమీద కునుకు ప‌ట్ట‌నీకుండా చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఆ స‌న్నివేశంపై డా.రెడ్డి తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఇది ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని, వైద్యులను విమర్శిస్తూ రోగులలో అపనమ్మకాన్ని పెంచిందని వాదించారు. ``అలాంటి సన్నివేశాన్ని రాసిన ర‌చ‌యిత‌లు చాలా హాని చేశారు. ఈ త‌ర‌హా వర్ణన వల్ల వైద్యులను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. కొద్ది శాతం మంది వైద్యులు అనైతికంగా ప్రవర్తించి రోగులను దోపిడి చేస్తారనేది నిజమే అయినా కానీ, సినిమాలో ఈ అంశాలను అతిశయోక్తిగా చూపించారు`` అని డాక్టర్ రెడ్డి చెప్పారు. ``ఇప్పుడున్న ఒత్తిళ్ల‌తో కూడుకున్న‌ పరిస్థితులలో మా వృత్తిలో ఒక రోజు అనుభ‌వం ఘ‌డించ‌మ‌ని నేను సినిమా రచయితలను సవాల్‌ చేస్తున్నాను. ఎవ‌రూ ఒక్కరోజు కూడా ఉండలేరు. మేం కృతజ్ఞత పొంద‌లేని ఉద్యోగాలు చేస్తాము``అన్నారాయన.

డాక్టర్ రెడ్డి చిరంజీవితో తన స్నేహం గురించి ప్రస్తావించారు. చిరంజీవి ఇంటికి చాలాసార్లు అతిథిగా వచ్చానని చెప్పారు. ఠాగూర్‌లోని సన్నివేశం వైద్య నిపుణుల మనశ్శాంతికి ఎలా భంగం కలిగించిందనే దాని గురించి చిరంజీవితో తన భావాలను పంచుకున్నాన‌ని తెలిపారు. ఆ సన్నివేశాన్ని నిజానికి మరింత విపరీతంగా చిత్రీక‌రించినా కానీ, మా అభ్యర్థన మేరకు చిరంజీవి సూచ‌న‌తో సినిమాలో టోన్ తగ్గించారు.. అని తెలిపారు.

Tags:    

Similar News