పవన్ కు గిఫ్ట్ గా OG.. రిలీజ్ అప్పుడే: డీవీవీ దానయ్య
షూటింగ్ అయ్యాక మొత్తం బడ్జెట్ చెప్తానన్నారు. మొత్తానికి దానయ్య వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ నింపేశాయి.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ కోసం సినీ ప్రియులతో పాటు ఆయన ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై వేరే లెవల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఏపీ ఎన్నికలు రావడం.. ఆ తర్వాత పవన్ గెలవడం.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. అలా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్. దీంతో ఆయన చేతిలో ఉన్న సినిమాల్లోని ఒకటైన ఓజీ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత డీవీవీ దానయ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. ఇటీవల పవన్ ను కలిశానని, ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పారు. మూడు సినిమాలను కంప్లీట్ చేస్తానని చెప్పారని, తర్వాత విషయం తనకు తెలియదన్నారు. వరుసగా తన చేతిలో ఉన్న చిత్రాలకు కాల్షీట్లు ఇచ్చి పూర్తి చేయనున్నారని వెల్లడించారు.
ఓజీ సినిమా 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపారు డీవీవీ దానయ్య. ఎక్కడికి వెళ్లినా ఓజీ కోసమే అంతా అడుగుతున్నారని చెప్పారు. ఓ రేంజ్ లో మూవీ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ పరిసరాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. సెట్స్ కూడా వేస్తున్న విషయం నిజమేనని వెల్లడించారు. సాహో మూవీ క్లిక్ అవ్వకపోయినా.. డైరెక్టర్ సుజిత్ పై తనకు చాలా నమ్మకం ఉందని చెప్పారు. త్రివిక్రమ్ తో డిస్కస్ చేశాక సుజిత్ ను తీసుకున్నామని చెప్పారు.
సుజిత్.. పవన్ తో సినిమా చేస్తే.. కొత్తగా స్టైలిష్ గా అవుట్ పుట్ ఉంటుందని అంచనా వేసి కాంటాక్ట్ చేశానని తెలిపారు. త్రివిక్రమ్ తో తాను డిస్కస్ చేసిన తర్వాత సుజిత్ ను డైరెక్టర్ గా ఫిక్స్ చేశామని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో దాదాపు 12 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ కు దానయ్య ఇచ్చిన అడ్వాన్స్ బదులు.. సుజిత్ ను ఆయన సెట్ చేశారని వార్తలు రాగా.. వాటిపై స్పందించారు. త్రివిక్రమ్ కు ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉందని చెప్పారు. ఆయనతో మరో సినిమా చేస్తానని వెల్లడించారు.
అయితే కొత్త సినిమాల ప్లాన్స్ ఇంకా ఏం లేవని తెలిపారు దానయ్య. ఓజీని పూర్తి చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చి.. పవన్ ను గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో మూవీ రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని వెల్లడించారు. మార్చి నెల అస్సలు దాటనివ్వని పేర్కొన్నారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నామని తెలిపారు. షూటింగ్ అయ్యాక మొత్తం బడ్జెట్ చెప్తానన్నారు. మొత్తానికి దానయ్య వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో జోష్ నింపేశాయి.