పవన్‌ని ఇబ్బంది పెట్టొద్దు... నిర్మాత విజ్ఞప్తి
పవన్ కళ్యాణ్‌ను పదే పదే ఓజీ ఓజీ అంటూ అభిమానులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఓజీ నిర్మాతలు ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. అధికారులతో సమీక్షలు, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ సమయం చూసుకుని ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేసేందుకు షూటింగ్‌కి హాజరు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆ రెండు సినిమాలను మొదలు పెట్టి రెండేళ్లకు పైగా అయ్యింది. కానీ పవన్ బిజీగా ఉండటం వల్ల పూర్తి కావడం లేదు. కానీ 2025లో ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అంటూ ఆయా చిత్రాల నిర్మాతలు చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు సినిమాల షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్‌లోనే రెండు మూడు నెలల వ్యవధిలో రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈమధ్య ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. అప్పట్లో సీఎం సీఎం అంటూ అరిచే అభిమానులు ఇప్పుడు ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఉన్నారు. ఇటీవల ఒక పర్యటనకు వెళ్లిన సమయంలో ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయడంతో పవన్ అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ నినాదాలు ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్‌ను పదే పదే ఓజీ ఓజీ అంటూ అభిమానులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఓజీ నిర్మాతలు ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా దానయ్య అండ్ టీం... ఓజీ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకు రావడం కోసం నిరంతరం పని చేస్తున్నాము. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం సందర్భం లేకుండా ఓజీ ఓజీ అని అరవడం వారిని ఇబ్బంది పెట్టడం సరి కాదు. వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారని మన అందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, ఆ స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉండండి. 2025లో ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం అంటూ పేర్కొన్నారు.
సాహో సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియాలో ఓజీ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో త్వరలోనే పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఓజీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే పవన్ ను చూపిస్తూ సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.