అయితే యానిమల్ లేకుంటే సలార్.. ఇంతేనా?
భారీతనం నిండిన సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఏదైనా కొత్తదనం నిండిన ప్రయత్నం చేస్తుంటే దానిపై జనం ఫోకస్ కూడా అంతే ఇదిగా ఉంటుంది
భారీతనం నిండిన సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఏదైనా కొత్తదనం నిండిన ప్రయత్నం చేస్తుంటే దానిపై జనం ఫోకస్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఇటీవల సందీప్ వంగా 'యానిమల్' సినిమా టీజర్, ట్రైలర్ తో ఎంత హైప్ వచ్చిందో చూస్తున్నదే. ఈ సినిమా భారీ ఓపెనింగులకు ఈ బజ్ కలిసొచ్చింది. యానిమల్ కి సమీక్షలు కూడా పాజిటివ్ గా పడిపోవడంతో ఇప్పుడు రణబీర్ అండ్ టీమ్ లో అది జోష్ ని నింపింది.
యానిమల్ తర్వాత మళ్లీ ఆ రేంజులో హైప్ సలార్ కే. టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న అతి భారీ సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో కేజీఎఫ్ దర్శకుడి ప్రయత్నంగా సలార్ పై బోలెడంత క్రేజ్ నెలకొంది. ఇంతకుముందు టీజర్ తోనే బోలెడంత హైప్ తెచ్చాడు నీల్. ఇప్పుడు డిసెంబర్ 1న ట్రైలర్ లాంచ్ తో దీనిని పరాకాష్ఠకు చేర్చనున్నాడు. అదే నెలలో క్రిస్మస్ కానుకగా సినిమా విడుదలవుతుంది. యానిమల్ ఓపెనింగుల్లో రికార్డులు క్రియేట్ చేయబోతోంది. సలార్ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందన్న ముచ్చట యథాలాపంగా సాగిపోతోంది.
అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చిపడింది. దేశంలోని ప్రజలంతా అయితే యానిమల్ గురించి లేదా సలార్ గురించి మాట్లాడుకుంటే చిన్నా చితకా సినిమాల పరిస్థితి ఏం కావాలి. ఆ రకంగా చూస్తే, నాని హాయ్ నాన్న.. నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వరుసగా డిసెంబర్ 7 - 8 తేదీల్లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ సినిమాలను ఇలాంటి సమయంలో పట్టించుకునేదెలా? జనంలో బజ్ క్రియేట్ చేయడంలో వీరంతా తడబడుతున్నారు. అందుకేనేమో నిర్మాతలు ఇప్పుడు పూర్తి ప్రచారంపై దృష్టి సారించారు. నితిన్ ఈ శుక్రవారం మాల్స్ ఇతర అవుట్‌డోర్ ఈవెంట్‌లలో సినిమాను ప్రమోట్ చేస్తుండగా, నాని టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. ఓవైపు తెలంగాణ ఎన్నికల రిజల్ట్, మరోవైపు సలార్ ట్రైలర్ లాంచ్ క్రేజ్ ను అధిగమించేలా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో నాని, నితిన్ ఏమేరకు సఫలమవుతారో చూడాలి.