గ్లోబల్ స్టార్ మూవీకి బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి?
గ్లోబల్ స్టార్ డమ్ సాధించిన హీరో నుంచి రాబోయే తదుపరి సినిమాపై హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఎందుకనో ''గేమ్ ఛేంజర్'' విషయంలో అలా జరగడం లేదు.
RRR సినిమాతో రామ్ చరణ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా సక్సెస్ లో వాటా ఉన్నప్పటికీ.. మేజర్ క్రెడిట్ మాత్రం చెర్రీకే దక్కుతుందని మెగా ఫ్యాన్స్ వాదిస్తూ ఉంటారు. అందుకే ఇన్నాళ్లూ 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్ తో పిలవబడిన చరణ్.. ఇప్పుడు తన ట్యాగ్ ను 'గ్లోబల్ స్టార్'గా మార్చుకున్నారు. గ్లోబల్ స్టార్ డమ్ సాధించిన హీరో నుంచి రాబోయే తదుపరి సినిమాపై హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఎందుకనో ''గేమ్ ఛేంజర్'' విషయంలో అలా జరగడం లేదు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్వీసీ బ్యానర్ లో 50వ చిత్రం కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. ఒక స్టార్ హీరో మూవీకి రావాల్సినంత హైప్ అయితే రాలేదనే చెప్పాలి. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. కానీ దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో సందడి కనిపించడం లేదు.
'గేమ్ ఛేంజర్' సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా దిల్ రాజు నిర్మిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం', డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'డాకు మహారాజ్' చిత్రాలు కూడా అదే సీజన్ లో వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ సినిమా కావడంతో ఎప్పటిలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగా 'గోదారి గట్టుమీద' పాట సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి యునిక్ వేలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నందమూరి బాలకృష్ణ సినిమా ప్రచారం కూడా మొదలైపోయింది. 'ది రేజ్ ఆఫ్ డాకు' అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
'గేమ్ ఛేంజర్' నుంచి ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. 'జరగండి', 'రా మచ్చా మచ్చా', 'నానా హైరానా' వంటి పాటలకు యూట్యూబ్ లో వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ.. ఎందుకనో ఇవి సినిమాకి పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఇటీవల వచ్చిన 'దేవర', 'పుష్ప 2' రేంజ్ లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చెయ్యలేకపోయాయి. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఆశించిన స్థాయిలో ప్రీసేల్స్ జరగడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయానికి 127 లొకేషన్స్ లో 367 షోలకు గాను 1311 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, $38180 అడ్వాన్స్ సేల్స్ ద్వారా వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల వచ్చిన స్టార్ హీరోల సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా తక్కువనే అనుకోవాలి.
ప్రస్తుతానికైతే మిగతా సంక్రాంతి సినిమాల కంటే 'గేమ్ ఛేంజర్' కాస్త వెనుకబడి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ కు ఇంకా నాలుగు వారాల సమయమే ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే డల్లాస్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే 'ధోప్' అనే నాలుగో పాటను విడుదల చెయ్యాలని చూస్తున్నారు. నెలాఖరున థియేట్రికల్ ట్రైలర్ ను వదులుతారని సమాచారం. దీని కోసం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఫంక్షన్ చేస్తారని, దీనికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా వస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ జరిగే క్రమంలో రామ్ చరణ్ సినిమాకి హైప్ పెరుగుతుందేమో చూడాలి.