గేమ్ చేంజర్.. కౌంటర్ గట్టిగా ఇవ్వాల్సిందే
2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
గేమ్ చేంజర్.. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా. దీని కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. 2021లో మొదలైన సినిమా ఇంకా రిలీజ్ కాలేదంటే అభిమానులు ఎంతగా ఫ్రస్టేట్ అవుతుంటారో చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆలస్యం అయితే అయింది.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారని మెగా ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి టీజరే రిలీజ్ కాలేదు. కొన్ని పోస్టర్లు, రెండు పాటలతో సరిపెట్టింది టీం. వాటికి రెస్పాన్స్ మరీ గొప్పగా ఏమీ లేదు. మరోవైపు సినిమా బాగా ఆలస్యం కావడం, శంకర్ చివరి చిత్రం ‘ఇండియన్-2’ దారుణమైన డిజాస్టర్ కావడంతో ‘గేమ్ చేంజర్’కు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాని మాట వాస్తవం.
సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రానుండడం ‘గేమ్ చేంజర్’కు పెద్ద అడ్వాంటేజీనే. కాకపోతే రిలీజ్ టైమింగ్ బాగున్నా సినిమా కంటెంట్ పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం చాలా అవసరం. శంకర్ మీద అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా పట్ల అంచనాలు పెంచేలా మంచి టీజర్ వదలాల్సిన అవసరం ఉంది. టీజర్ కనుక ఆశించిన స్థాయిలో లేదంటే మాత్రం సినిమాకు హైప్ పెరగడం కష్టమే. టీజర్ గురించి గతంలో చాలాసార్లు ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు. ఐతే ఎట్టకేలకు దీపావళి కానుకగా ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. విడుదలకు అప్పటికి ఇంకో నెలన్నరే సమయం ఉంటుంది కాబట్టి టీజర్ రిలీజ్ చేయడంలో ఇంతకంటే లేట్ చేస్తే కష్టం. కాబట్టి దీపావళికి ‘గేమ్ చేంజర్’ టీజర్ ట్రీట్ ఉంటుందనే ఆశించవచ్చు. మంచి టీజర్ కట్ చేసి వదిలారంటే ఇప్పటిదాకా ఉన్న నెగెటివిటీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లే. కోరుకున్న బజ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది.