రీ రిలీజ్ : అప్పట్లో రూ.50 కోట్లు, ఇప్పుడు 20 కోట్లు
ఒక్కడు స్థాయిలో గిల్లీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అప్పట్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ 20 ఏళ్ల క్రితం నటించిన గిల్లీ సినిమా తాజాగా రీ రిలీజ్ అయ్యింది. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో గిల్లీ ఒకటి అని అంతా అనుకున్నారు. కానీ గిల్లీ సినిమా రీ రిలీజ్ లో రాబట్టిన వసూళ్లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ అయిన ఒక్కడు కి రీమేక్ గా గిల్లీ సినిమా 20 ఏళ్ల క్రితం రూ. 8 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఒక్కడు స్థాయిలో గిల్లీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో అప్పట్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
20 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు కూడా ఏకంగా రూ.20 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక సినిమా రీ రిలీజ్ లో ఇంతటి భారీ వసూళ్లను దక్కించుకోవడం చాలా అరుదైన విషయం. ఒక వైపు విశాల్ నటించిన రత్నం సినిమా థియేటర్లలో ఉన్నా కూడా జనాలు మాత్రం గిల్లీ వైపు వెళ్తున్నారు.
రత్నం సినిమాతో పోల్చితే చాలా ఏరియాల్లో గిల్లీ సినిమాకి వసూళ్లు ఎక్కువగా నమోదు అవుతూ ఉండటం విశేషం. మొత్తానికి సుదీర్ఘ కాలంగా టీవీల్లో వందల సార్లు వచ్చి, ఓటీటీ ల్లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా గిల్లీ సినిమా రీ రిలీజ్ లో రూ.20 కోట్లు వసూళ్లు చేసి ఇంకా నడుస్తూనే ఉంది అంటే ఏ రేంజ్ విజయమో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ ఫ్యాన్స్ తమిళనాట మరీ వైల్డ్ గా ఉంటారు. వారు తమ అభిమాన హీరో సినిమా రీ రిలీజ్ లో పాన్ ఇండియా రికార్డ్ ను సొంతం చేసుకోవాలని భావించి మళ్లీ మళ్లీ ప్రత్యేక షో లు చూస్తున్నట్లుగా తమిళ మీడియా ల్లో కథనాలు వస్తున్నాయి.
గిల్లీ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటించింది. ఒక్కడులో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ ఈ రీమేక్ లో కూడా రిపీట్ అయ్యాడు. రీమేక్ కు ధరణి దర్శకత్వం వహించగా సంగీతాన్ని విద్యాసాగర్ అందించాడు. అప్పుడు ఏ స్థాయిలో ప్రేక్షకులు ఆధరించారో ఇప్పుడు కూడా గిల్లీకి ఆదరణ లభించడం విశేషం.