దిల్ రాజుకు దేవుళ్ళ దెబ్బ
ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల మీద కూడా రాజు ఫైర్ అయ్యారు.
దేవుళ్ళతో పెట్టుకుని దెబ్బ తిన్నాడు అంటూ దిల్ రాజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2022లో కార్తికేయ- 2 సినిమా జులైలో విడుదల కావలసి ఉండగా.. దాన్ని ఆగస్టు 12 కు మార్చాల్సి వచ్చింది. అందుకు కారణం దిల్ రాజు సినిమా థాంక్యూ అనే చర్చ జరిగింది. తన సినిమాకు పోటీ ఉండొద్దని దిల్ రాజు.. కార్తికేయ- 2ను వాయిదా వేయించాడు అని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. కట్ చేస్తే థాంక్యూ డిజాస్టర్ అయింది కార్తికేయ-2 ప్రభంజనం సృష్టించింది. ఇక వర్తమానంలోకి వస్తే.. హనుమాన్ చిత్రానికి చాలినన్ని థియేటర్లు దక్కకపోవడానికి దిల్ రాజే కారణం అని ఆరోపణలు రావడం.. దీని మీద పెద్ద గొడవ జరగడం తెలిసిందే.
ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల మీద కూడా రాజు ఫైర్ అయ్యారు. అయితే మిగతా విషయాలు పక్కన పెడితే.. రాజు రిలీజ్ చేసిన గుంటూరు కారంకే నైజాంలో 90 శాతానికి పైగా సింగిల్ స్క్రీన్లు లాగేయడం.. హనుమాన్ చిత్రానికి కేవలం నాలుగు డొక్కు థియేటర్లు కేటాయించడంపై జరిగిన రచ్చ అంతా తెలిసిందే. కట్ చేస్తే గుంటూరు కారం డివైడ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా ఇబ్బంది పెడుతోంది.
హనుమాన్ మాత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. పండగ సీజన్ కాబట్టి గుంటూరు కారం ఒక మోస్తరుగా నెట్టుకొస్తోంది కానీ.. చివరికి బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే కావచ్చు. నైజాంలో దిల్ రాజుకు కొంత నష్టం తప్పేలా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్ లో సైతం హనుమాన్ దెబ్బ గుంటూరు కారంపై గట్టిగా పడింది. కార్తికేయ -2, హనుమాన్ రెండు కూడా దేవుళ్యతో ముడిపడ్డ సినిమాలే కాగా.. రిలీజ్ పరంగా వీటికి ఇబ్బందులు ఎదురవడంలో దిల్ రాజు నింద ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రాజుకు దేవుళ్ళ దెబ్బ గట్టిగా తగిలింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.