హనుమాన్ నయా రికార్డ్.. 25 రోజుల్లోనే..
ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 25 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందీ మూవీ.
సంక్రాంతికి కానుకగా రిలీజైన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తోంది. సినిమా రిలీజై 25 రోజులు దాటుతున్నా థియేటర్స్ లో హనుమాన్ హవా తగ్గడం లేదు.
ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సృష్టించిన హనుమాన్ సినిమా.. ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 25 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందీ మూవీ. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది. ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్.. ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉందని తెలిపింది. అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని చెప్పింది.
చిన్న సినిమాగా రిలీజై రూ.300 కోట్ల కలెక్షన్స్ 25 రోజుల్లోనే వసూలు చేయడమంటే పెద్ద రికార్డే. కొంతమంది స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు కూడా రూ.300 కోట్లకు ఎక్కువ రోజులే పట్టాయి. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92 ఏళ్ల సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నింటినీ హనుమాన్ బీట్ చేసింది.
హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రీజన్ తోపాటు అమెరికాలో కూడా దూసుకుపోతోంది. అమెరికాలో 5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసి టాప్- 5 తెలుగు సినిమాగా నిలిచింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అమెరికాలో సక్సెస్ టూర్ వేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు అప్పుడే ఓటీటీ బాట పడుతుంటే హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్స్ లో తన హవా చూపిస్తోంది. ఈ సినిమా మార్చి లో జీ5 ఓటీటీలోకి వస్తుందని సమాచారం.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ వర్మ. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది.