హనుమాన్ మూవీ కేరాఫ్ పాడేరు అదెలా?
అయితే.. ఈ సినిమా గ్రాఫిక్స్ కు స్ఫూర్తినిచ్చింది ఉత్తరాంధ్రలోని పాడేరు కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి
సంక్రాంతి బరిలోకి చిన్న సినిమాగా దిగి.. పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’. అంచనాలకు మించిన కథతో అందరిని ఆకట్టుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా భారీ బడ్జెట్ సినిమాలకు తలదన్నేలా సొంతం చేసుకోవటం తెలిసిందే. ఈ సినిమాతో చిత్రదర్శకుడి గ్రాఫ్ ఎక్కడికో వెళ్లటమే కాదు.. ఆయన తర్వాతి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. హనుమాన్ సినిమాలో చిక్కటి కథనం ఒక ఎత్తు అయితే.. కళ్లకు కనువిందు చేసే గ్రాఫిక్స్ మాయాజాలం.. అద్భుతమైన లొకేషన్లు కూడా థియేటర్ లో సీట్లలో కదలకుండా చేశాయి.
అయితే.. ఈ సినిమా గ్రాఫిక్స్ కు స్ఫూర్తినిచ్చింది ఉత్తరాంధ్రలోని పాడేరు కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. చీడికాడ మండలంలోని కోనాం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాల్ని షూట్ చేశారు. దీంతో.. ఈ ప్రాంతానికి వెళ్లి.. అక్కడి నేచర్ ను ఎంజాయ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ చిత్రానికి అద్భుత రీతిలో గ్రాఫిక్స్ ను డిజైన్ చేసిన ఉదయ్ క్రిష్ణ సైతం చోడవరం ప్రాంతానికి చెందిన వాడే కావటం ఒక ఎత్తు అయితే.. అతడి స్కూలింగ్ మొత్తం చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే సాగింది.
తక్కువ బడ్జెట్ సినిమాలకు.. పరిమిత వనరులతో అద్భుతాల్ని క్రియేట్ చేసే టాలెంట్ ఉన్న ఉదయక్రిష్ణ హైదరాబాద్ లోనే తన కెరీర్ ను షురూ చేశాడు. చెన్నై.. బెంగళూరు.. ముంబయిలోని పలు మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు బాలీవుడ్.. హాలీవుడ్ మూవీలకు పని చేసిన టాలెంట్ అతడి సొంతం. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో దాదాపు పాతికేళ్ల అనుభవం ఉన్న ఆయన హనుమాన్ మూవీతో అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.
పాడేరు అందాల్ని స్ఫూర్తిగా తీసుకొని తన గ్రాఫిక్స్ మాయాజాలంతో హనుమాన్ మూవీలో కొన్ని లొకేషన్లుగా క్రియేట్ చేవారు. ఇందుకు తన బాల్య మిత్రుడైన ఫోటోగ్రాఫర్ ను వెంట పెట్టుకొని వారం పాటు పాడేరులోని పలు ప్రాంతాల్లో మూడు వేలకు పైగా ఫోటోలు తీయించారు. వాటిని సినిమాలో గ్రాఫిక్స్ కు అనుగుణంగా వాడుకోవటం గమనార్హం. సినిమాలో అందరిని అకర్షించిన హనుమాన్ భారీ విగ్రహం గ్రాఫిక్స్ అయినా.. ఆ చుట్టూ ఉన్న లొకేషన్ మాత్రం పాడేరులోదే కావటం విశేషం. ఏమైనా.. ఉత్తరాంధ్ర అందాలకు తన గ్రాఫిక్స్ మాయాజాలంలో వెండితెరకు కొత్త మెరుపులకు కారణమయ్యారని చెప్పాలి.