ఉస్తాద్ భగత్ సింగ్.. ఓ మ్యాజిక్ ఎపిసోడ్

తాజాగా 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కూడా హరీష్ శంకర్ మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రస్తావించారు.

Update: 2024-09-01 03:45 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. గబ్బర్ సింగ్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో, ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

కానీ, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అనేక కారణాల వల్ల ఆలస్యం కావడం మరో వర్గం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది ఇటీవల 'మిస్టర్ బచ్చన్' ప్రమోషన్లలో కూడా హరీష్ శంకర్, 'ఉస్తాద్ భగత్ సింగ్' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా, అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని తన ధీమాను వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటారని హరీష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో మరోసారి ఉత్సాహం నింపాయి. తాజాగా 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కూడా హరీష్ శంకర్ మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రస్తావించారు.

'గబ్బర్ సింగ్'లో వచ్చిన అంత్యాక్షరి ఎపిసోడ్ గురించి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ఉస్తాద్ భగత్ సింగ్' లో కూడా ఓ ప్రత్యేకమైన మ్యూజికల్ ఎపిసోడ్ ఉంటుందని వెల్లడించారు. ఆ ఎపిసోడ్ అంత్యాక్షరి తరహాలో కాకపోయినా మ్యూజికల్ టచ్ తో థియేటర్లు షేక్ అయ్యేలా చేస్తుందని హరీష్ శంకర్ ధైర్యంగా చెప్పారు.

'గబ్బర్ సింగ్'లో అంత్యాక్షరి సీన్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవడంతో, టాలీవుడ్‌లో దాన్ని అనుకరించిన సినిమాలు బాగానే వచ్చాయి. అయితే, ఆ చిత్రాల్లో ఈ ఫార్ములా పెద్దగా వర్కవుట్ కాలేదని కూడా ఆయన పేర్కొన్నారు. హరీష్ మాట్లాడుతూ, సందర్భం కుదిరితే తప్ప ఎపిసోడ్‌ను బలవంతంగా ఇరికించను అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యతో 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఉండబోయే ఆ ఎపిసోడ్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల ఎప్పుడనేది ఇంకా క్లారిటీ చెప్పకపోయినా వచ్చే ఏడాది సినిమా విడుదక అయ్యే ఛాన్స్ ఉంటుందని అర్ధమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ ఉంటుందని నిర్మాత రవిశంకర్ ఇటీవల వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News