హరీష్ శంకర్, బండ్ల గణేష్ వివాదం.. చాలా ఏళ్ల తర్వాత..

ఆ సమయం తాను, హరీష్ నీటి పాముల్లాంటి వాళ్లమని తెలిపారు గణేష్. అప్పటి వివాదాన్ని తానే స్వయంగా మీడియా ముందు ప్రస్తావించారు.

Update: 2024-08-31 17:12 GMT

నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్య మాటల యుద్ధం గుర్తుందా? 14 ఏళ్ల క్రితం వీరి కాంబోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ లో ఫుల్ జోష్ నింపిన ఆ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత హరీష్.. మూవీ టీమ్ అందరికీ థాంక్స్ చెబుతూ లెటర్ ను రిలీజ్ చేశారు. అందులో బండ్ల గణేష్ పేరును ప్రస్తావించలేదు.

దీంతో హరీష్ శంకర్ పై బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అయ్యారు. పవన్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం తన వల్ల వచ్చిందని, కానీ హరీష్ కు సంస్కారం లేదని ఆయన ఆరోపించారు. హరీష్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని విమర్శించారు. మళ్లీ ఆయనతో సినిమా చేయనని తెలిపారు. అప్పుడు హరీష్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. ప్రతి రిలేషన్ లో గొడవలు, మనస్ఫర్థలు కామన్ అని బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తరచూ జరుగుతుంటాయని తెలిపారు.

హరీష్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, తనతో ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్పారు. ఇది జరిగి చాలా ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ విషయాన్ని గుర్తు చేశారు బండ్ల గణేష్. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న గబ్బర్ సింగ్‌ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో హరీష్ శంకర్, బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయం తాను, హరీష్ నీటి పాముల్లాంటి వాళ్లమని తెలిపారు గణేష్. అప్పటి వివాదాన్ని తానే స్వయంగా మీడియా ముందు ప్రస్తావించారు.

కోపానికి, పగకు చాలా తేడా ఉందని చెప్పారు బండ్ల గణేష్. ఎప్పుడైనా కోప్పడే వాడు ఎవరికీ హానికరం కాదని, కోపం అనేది నీటి పాము లాంటిదని తెలిపారు. అది ఒకవేళ కరిచినా పర్వాలేదని అన్నారు. కానీ పగ మాత్రం నాగు పాము లాంటిదని వ్యాఖ్యానించారు. తామంతా నీటి పాములు లాంటి వాళ్లమని అన్నారు. చెప్పాలంటే.. కోప్పడే బ్యాచ్ అని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఏదేదో మాట్లాడుతుంటామని చెప్పారు. కానీ మనసులో అస్సలు పెట్టుకోమని తెలిపారు.

ఆ క్షణానికి అది వదిలేస్తామని, తమలో ఇగోలు ఉండవని అన్నారు బండ్ల గణేష్. ఫ్యూచర్ లో హరీష్ శంకర్ తో సినిమా 200 శాతం తీస్తానని తెలిపారు. గబ్బర్‌ సింగ్‌ స్థాయి చిత్రం చేయకపోతే తన పేరు బండ్ల గణేశ్‌ కాదని శపధం చేశారు. పరమేశ్వర ఆర్ట్స్‌ బండ్ల గణేశ్‌ అంటే ఏంటో చూపించేందుకు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు నిర్మిస్తానని తెలిపారు. ఇకపై సినిమాల్లోనే ఉంటానని వెల్లడించారు. మరి బండ్ల గణేష్ నిర్మాతగా ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News