మిస్టర్ బచ్చన్.. అతని రెమ్యునరేషన్ వెనక్కి..

అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ను హరీష్ శంకర్ తెరకెక్కించగా.. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటించింది.

Update: 2024-09-04 09:58 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నామ్ తో సునా హోగా ట్యాగ్ లైన్ తో వచ్చిన ఆ సినిమా.. ఆగస్టు 15వ తేదీన విడుదల అయింది. ఇప్పటికే రవితేజ, హరీష్ కాంబోలో వచ్చిన షాక్, మిరపకాయ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో.. మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. కానీ అనుకున్న స్థాయిలో మూవీ మెప్పించలేకపోయింది.

అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ను హరీష్ శంకర్ తెరకెక్కించగా.. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఫస్ట్ మూవీతో డిజాస్టర్ అందుకుంది. అయితే సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు. బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో మేకర్స్ కు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మూవీ వల్ల నష్టాలు వచ్చినందున.. తన రెమ్యునరేషన్ నుంచి రూ.6 కోట్లను నిర్మాతకు ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రూ.2 కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు కోట్ల రూపాయలు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చేయనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యూనరేషన్ లో తీసుకోమని విశ్వప్రసాద్ కు హరీష్ చెప్పారట.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరీష్ శంక‌ర్ చేసిన ప‌నికి మాస్ మహారాజా ఫ్యాన్స్ తోపాటు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు హీరో రవితేజ రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. మరి ఆయన కూడా హరీష్ శంకర్ బాటలో నడుస్తారేమోనని అంటున్నారు. తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగిస్తారని చెబుతున్నారు.

ఇక మూవీ విషయానికొస్తే.. రవితేజ, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించగా.. సీనియర్ నటుడు జగపతి బాబు విలన్ గా కనిపించారు. సత్య, చమ్మక్ చంద్ర, ప్రవీణ్, సచిన్ ఖేడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మంచి సంగీతాన్ని అందించారు. భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది మిస్టర్ బచ్చన్ మూవీ. మరి ఓటీటీ ప్రియులకు సినిమా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News