తారక్ తో మూవీ.. హరీష్ అలా అన్నాడేంటి!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-08-20 08:20 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. సమంత, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఆ మూవీ రిజల్ట్ పై ఇప్పటికే పలుమార్లు స్పందించారు హరీష్ శంకర్. తారక్ కు మరో హిట్ ఇస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్, హరీష్ కాంబోలో మరో సినిమా రాలేదు.

తాజాగా హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో చాటింగ్ రైడ్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా తారక్ తో మరో సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ ఇప్పటికిప్పుడు రెడీగా లేదని తెలిపారు హరీష్ శంకర్. ఆయన రేంజ్ కు తగ్గట్టు స్క్రిప్ట్ రాయాలని అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ ఎలా ఉందో అందరికీ తెలుసని, అలానే తారక్ లైనప్ కూడా తనకు తెలుసని చెప్పారు. కాబట్టి ఆయనను ఇప్పుడు అప్రోచ్ అవ్వడం కష్టమని తెలిపారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు నిజాయతీగా ఆన్సర్ ఇస్తానని అన్నారు.

మరోవైపు, తన రెండో సినిమా కూడా తారక్ తో చేయాల్సిందని తెలిపారు హరీష్ శంకర్. షాక్ సినిమా ఫ్లాప్ అయినా తనకు తారక్ ఛాన్స్ ఇచ్చాడని చెప్పారు. కానీ తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ బాధ తనకు ఉందని వెల్లడించారు. తారక్ ఎప్పుడూ తనకు స్పెషలేనని తెలిపారు. అయితే తన రెండో సినిమా ఎన్టీఆర్ తో అనుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల వర్కౌట్ కాలేదని చెప్పారు. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర మంచి హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర.. మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తారక్ ఇటీవల తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. మిగతా భాగం త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా.. అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. త్వరలో మూడో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దేవరతోపాటు ఎన్టీఆర్.. వార్-2 కూడా చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్-2 లో తారక్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. వీటితోపాటు మరో సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవర-2 కూడా ఎన్టీఆర్ లైనప్ లో ఉంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ పై దృష్టి పెట్టనున్నారు మేకర్స్. అయితే వీటిని చూసే.. హరీష్ శంకర్ ఆయనతో సినిమా చేయడం కష్టమని చెప్పినట్లు ఉన్నారు.

Tags:    

Similar News