'హరోంహర' మూవీ రివ్యూ

ఓ మంచి విజయం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు హీరో సుధీర్ బాబు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హరోంహర' ప్రోమోలు చూస్తే ప్రామిసింగ్ గా కనిపించాయి.

Update: 2024-06-14 08:27 GMT

'హరోంహర' మూవీ రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు-మాళవిక శర్మ-సునీల్-జయప్రకాష్-అర్జున్ గౌడ-రవి కాలె-కాదంబరి కిరణ్ తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథన్

నిర్మాత: సుమంత్ జి.నాయుడు

రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక

ఓ మంచి విజయం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు హీరో సుధీర్ బాబు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హరోంహర' ప్రోమోలు చూస్తే ప్రామిసింగ్ గా కనిపించాయి. కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతోనైనా సుధీర్ బాబు నిరీక్షణకు తెరపడేలా ఉందా? చూద్దాం పదండి.

కథ: 80వ దశకంలో సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) అనే కుర్రాడు వేరే ఊరి నుంచి బతుకు తెరువు కోసం కుప్పం పట్టణానికి వస్తాడు. ఓ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంటుగా పని చేస్తున్న అతను అనుకోకుండా ఒక గొడవలో భాగం అవుతాడు. దీంతో తన ఉద్యోగం పోతుంది. అదే సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థఇతి తలెత్తుతుంది. అప్పుడే సుబ్రహ్మణ్యం దృష్టి తుపాకీల తయారీ మీద పడుతుంది. గుట్టు చప్పుడు కాకుండా ఆ పని మొదలుపెడతాడు. అందులో తన పనితనం కారణంగా చూస్తుండగానే అంచెలంచెలుగా ఎదుగుతాడు. దీంతో పాటే తన శత్రు వర్గం కూడా పెరుగుతుంది. వారి నుంచి సుబ్రహ్మణ్యంకు ఎదురైన అడ్డంకులేంటి.. వాటిని అతనెలా అధిగమించాడు.. చివరికి అతడి జీవితం ఏ తీరానికి చేరింది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: అరాచకం రాజ్యమేలుతున్న ఓ ప్రాంతంలోకి ఒక మామూలు వ్యక్తి రావడం.. ఓ అన్యాయానికి ఎదురెళ్లే క్రమంలో యోధుడిగా అవతరించడం.. ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ ప్రాంత ప్రజలకు ఆశాదీపంలా మారడం.. దాంతో పాటే శత్రువులు కూడా పెరగడం.. వారితో పోరులో చివరికి హీరో విజయం సాధించడం.. ఇది దశాబ్దాలుగా కమర్షియల్ సినిమాలకు సక్సెస్ ఫార్ములాగా మారిన లైన్. ఏదో ఒక భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకుని ఈ లైన్లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూనే ఉన్నారు రచయితలు-దర్శకులు. ఛత్రపతిలో రాజమౌళి పోర్ట్ నేపథ్యంతో పాటు మదర్ సెంటిమెంట్ ను ఈ ఫార్ములాలో మిక్స్ చేసి సక్సెస్ కొడితే.. 'కేజీఎఫ్'లో ప్రశాంత్ నీల్ గోల్డ్ ఫీల్డ్స్ అనే కొత్త ప్రపంచాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇక సుకుమారేమో 'పుష్ప'లో ఎర్రచందనం నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు 'హరోంహర' అనే సినిమా చూస్తుంటే ఈ సినిమాలన్నింటినీ కలిపి మిక్సీలో వేసి తీసినట్లు అనిపిస్తుంది. కథ సహా అన్నిచోట్లా అనుకరణ కనిపించడం.. ఒరిజినాలిటీ లేకపోవడం.. సుధీర్ బాబుకున్న ఇప్పటిదాకా క్లాస్ ఇమేజ్ దృష్ట్యా ఇందులోని ఎలివేషన్లు అతిగా అనిపించడం ప్రతికూలమే అయినా.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు టైంపాస్ వినోదాన్ని అందించడంలో మాత్రం 'హరోంహర' ఫెయిలవ్వలేదు.

పైన చెప్పుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలన్నింట్లోనూ కథా గమనం.. హీరోల పాత్ర చిత్రణ పరంగా సారూప్యత కనిపించినా.. నేపథ్యం భిన్నంగా అనిపిస్తుంది. 'హరోం హర'లోనూ కొత్త దర్శకుడు జ్ఞానసాగర ద్వారక ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడం కోసం భిన్నమైన నేపథ్యాన్నే తీసుకున్నాడు. అదే తుపాకీల తయారీ. ఇందులో హీరో గన్ స్మిత్. ఆ నైపుణ్యంతోనే అంచెలంచెలుగా ఎదుగుతాడు. కథలో డ్రామా అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే.. 'కేజీఎఫ్‌' సినిమాలో చూపించిన గోల్డ్ ఫీల్డ్స్.. 'పుష్ప'లో చూపించిన ఎర్రచందనం నిజంగానే ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ నేపథ్యం తీసుకుని లార్జర్ దన్ లైఫ్ స్టయిల్లో ఆ బ్యాక్ డ్రాప్స్ ను ప్రెజెంట్ చేస్తే అవేమంత అతిశయోక్తుల్లా అనిపించలేదు. కానీ 'హరోం హర'లో తీసుకున్న తుపాకీల తయారీ.. దాని చుట్టూ నడిచే మాఫియా సామ్రాజ్యానికి కుప్పం ప్రాంతానికి వాస్తవంగా ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదు. చిత్తూరు జిల్లాలోని చిన్న టౌన్ అయిన కుప్పంలో 80వ దశకంలో ఇంత మాఫియా నడిచినట్లు చూపించడం కృత్రిమంగా అనిపిస్తుంది. వేరే సినిమాల్లో అయితే ఓకే కానీ.. ఒక ప్రాంతాన్ని.. యాసను.. అక్కడి పరిస్థితులను ఎలివేట్ చేసి చూపిస్తున్నపుడు అక్కడి వాస్తవిక పరిస్థితులకు సినిమాలో చూపించిన దానికి ఎంతో కొంత పోలిక ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి అవకాశముంటుంది. 'హరోంహర'లో అది మిస్ కావడం మైనస్.

ఐతే కథలో, పాత్రల్లో పోలికల సంగతి పక్కన పెట్టి మామూలుగా చూస్తే 'హరోంహర' డీసెంట్ యాక్షన్ మూవీ అనడంలో సందేహం లేదు. కథ అంతా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగినా.. సన్నివేశాల్లో ఉన్న ఆసక్తి వల్ల ప్రేక్షకుడి దృష్టి మరలదు. కుప్పం నిజంగా ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమా ఎక్కడ తీశారో కానీ.. ఏదో ఒక కేరళ టౌన్ ను చూస్తున్నట్లుగా ప్రొడక్షన్ డిజైన్ అంతా బాగా చేశారు. మేకింగ్ పరంగా ఒక పెద్ద సినిమా స్థాయిలో క్వాలిటీ చూపించడం.. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో భారీ యాక్షన్ బ్లాక్స్ పడడం వల్ల 'హరోం హర' బాగానే సాగిపోతుంది. విలన్లను పెద్ద బిల్డప్ తో పరిచయం చేసి.. తర్వాత వాళ్లను వీక్ చేసేసినా.. హీరో పాత్రను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంతో సన్నివేశాలు సాఫీగా సాగిపోతాయి. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్సయినా సరే.. హీరో గన్ స్మిత్ గా ఎదిగే క్రమం ప్రథమార్ధానికి హైలైట్. ఇంటర్వెల్ ఫైట్ యాక్షన్ ప్రియులను ఉర్రూతలూగిస్తుంది. ఐతే 'హరోంహర' ద్వితీయార్ధంలో డ్రామా అనుకున్న స్థాయిలో పండలేదు. హీరో ఎదుగుదలను సరిగా చూపించకపోవడం వల్ల తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్లలో కిక్ కనిపించదు. నిజానికి సెకండాఫ్ లో వచ్చే ఎలివేషన్ సీన్లు చాలా అతిగా అనిపించడానికి కూడా హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగా లేకపోవడమే. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగున్నా.. దానికి దారి తీసే సన్నివేశాల్లో బలం లేదు. 'సలార్'లోని కాటేరమ్మ ఫైట్.. 'విక్రమ్' క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులను యాజిటీజ్ దించేశాడు దర్శకుడు. సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ముగుస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాస్-యాక్షన్ ప్రియులను అలరించే స్టఫ్ అయితే 'హరోం హర'లో ఉంది. కానీ ఇదంతా ఆల్రెడీ చూసేశాం కదా అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.

నటీనటులు: సుధీర్ బాబు ఆశ్చర్యపరుస్తాడు. ఇప్పటిదాకా అతడికున్నది క్లాస్ ఇమేజ్. దానికి భిన్నంగా వీర లెవెల్లో యాక్షన్ విన్యాసాలు చేశాడిందులో. మొదట్లో అతడి పాత్రకు అలవాటు పడడానికి సమయం పడుతుంది. స్టైలిష్ సటిల్ యాక్టింగ్ తో సుబ్రహ్మణ్యం పాత్రను పండించడానికి అతను ప్రయత్నం చేశాడు. తన వరకు సుధీర్ బాగానే చేసినా.. కొన్నిసార్లు ఓవర్ ఎలివేషన్లు అతడికి నప్పలేదనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్తూరు యాసలో అతను డైలాగులు బాగానే పలికాడు. హీరోయిన్ మాళవిక శర్మ ఇప్పటిదాకా తెలుగులో చేసిన చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగైన పాత్రే దక్కింది ఇందులో. కానీ మామూలుగా చూస్తే తనది కథలో అంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ కాదు. సునీల్ హీరో తర్వాత అత్యంత గుర్తింపు ఉన్న.. కీలకమైన పాత్రలో రాణించాడు. ఆల్రెడీ 'పుష్ప'లో నటించడం వల్ల చిత్తూరు యాస మీద అతను పట్టు సాధించాడు. యాస.. నటనలో ఈజ్ కనిపిస్తుంది. విలన్లందరి పాత్రలో మొదట్లో ఉన్నంత బలంగా తర్వాత అనిపించవు. రవి కాలె.. అర్జున్ గౌడ.. మెయిన్ విలన్ గా చేసిన నటుడు బాగానే చేశారు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా 'హరోం హర' సౌండ్ ఫిలిమే. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ తొలిసారి తనలోని మాస్ కోణాన్ని చూపించాడు. యాక్షన్ సీక్వెన్సులు.. ఎలివేషన్ సీన్లను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగానే పైకి లేపాడు. సినిమా అంతటా స్కోర్లో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. సినిమాకు అతనొక భిన్నమైన లుక్ తీసుకొచ్చాడు. కథలో చూపించినట్లు ఇది 80ల నాటి చిత్రం అనే భావన విజువల్స్ ద్వారా కలిగించాడు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సుధీర్ బాబు మార్కెట్ గురించి పట్టించుకోకుండా నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక విషయం ఉన్నవాడే. ఒక స్టార్ హీరో స్థాయికి తగ్గ కథ తయారు చేసుకుని.. యాక్షన్-ఎలివేషన్ సీన్లను బాగా డీల్ చేశాడు. కాకపోతే కథ సహా చాలా విషయాల్లో ఏదో ఒక సినిమా స్ఫూర్తి కనిపిస్తుంది. ఫలానా సినిమాలా తీద్దాం అనే ప్రయత్నంలా కనిపిస్తుంది తప్ప ఒరిజినాలిటీ లేకపోయింది.

చివరగా: హరోంహర.. యాక్షన్ మిక్చర్ పొట్లం

రేటింగ్-2.5/5

Tags:    

Similar News