500కి పైగా సినిమాలు.. నటనకు గుడ్‌బై!

తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇకపై కొత్త ప్రాజెక్ట్‌లను చేయబోనని తేల్చిచెప్పింది.;

Update: 2025-03-19 08:26 GMT

తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటీమణి హేమ, ఇప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించింది. తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇకపై కొత్త ప్రాజెక్ట్‌లను చేయబోనని తేల్చిచెప్పింది. "జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా? కొంచెం బ్రేక్ తీసుకోవాలి కదా" అంటూ ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానులు, ఆమె సహచర నటీనటులు ఆశ్చర్యపోయారు.

హేమ గతంలో ఎన్నో కామెడీ పాత్రలు పోషించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడు, దేశముదురు, భగీరథ, శ్రీరామదాసు, మల్లీశ్వరి వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే తాజాగా, పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినా, ఇకపై నేను నటించను.. అని తేల్చిచెప్పింది. ఇది ఆమె అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. గత 14 ఏళ్లుగా పరిశ్రమలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్నానని, ఇప్పుడు ఎంజాయ్‌మెంట్‌కి ప్రాధాన్యత ఇస్తానని హేమ చెప్పడం అందరిలో చర్చనీయాంశంగా మారింది.

హేమ చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు, సినీ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఆమె వివాదాల్లో చిక్కుకోవడం, ముఖ్యంగా ఓ కేసులో పేరు తెరపైకి రావడం ఈ నిర్ణయానికి ప్రేరణ ఇచ్చిందా లేక నిజంగానే ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అయితే హేమ మాత్రం తన నిర్ణయం వెనుక ఎలాంటి వివాదాస్పద కారణాలు లేవని స్పష్టంగా చెప్పింది.

సినిమాల నుండి విరామం తీసుకోవడం అనేది సాధారణమైన విషయమే అయినప్పటికీ, హేమ తరహా సీనియర్ నటీమణులు తీసుకునే నిర్ణయాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతాయి. ఎందుకంటే ఆమె ఇప్పటివరకు దాదాపు 500 సినిమాలకు పైగా నటించింది. తెలుగు మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటుకుంది. ఇప్పుడు ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అవ్వాలనుకుంటుందా లేక కేవలం తాత్కాలిక విరామం తీసుకుంటుందా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఏదేమైనా, తనదైన శైలిలో దూసుకెళ్లిన హేమ, ఇప్పుడున్న టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె తిరిగి తెరపై కనిపించే అవకాశం ఉందా లేదా ఆమె నిజంగానే గుడ్‌బై చెప్పేసిందా అనే అంశం మరికొన్ని రోజుల్లో స్పష్టత పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఎంజాయ్‌మెంట్ మోడ్‌లో ఉండే మాట వాస్తవమే, కానీ తెరపై హేమను మళ్లీ చూడాలనుకునే అభిమానులు మాత్రం ఆలోచనలో పడిపోయారు.

Tags:    

Similar News