ట్రెండీ టాక్‌: అడ‌వుల బాట ప‌ట్టిన హీరోలు

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన `అడ‌వి రాముడు` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.;

Update: 2025-02-28 03:30 GMT

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన `అడ‌వి రాముడు` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. అప్ప‌ట్లో అమితాబ్ షోలే సినిమాని కూడా కొట్టేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ఈ సినిమా క‌థ అడ‌విలో సాగుతుంది. అడ‌విలో అక్ర‌మ క‌ల‌ప ర‌వాణా, స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జ‌య‌ప్ర‌ద‌తో అన్న‌గారి ప్రేమ‌క‌థ కూడా అంతే ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇక ఈ సినిమాకి పాట‌లు, సంగీతం ప్ర‌ధాన అస్సెట్. అడ‌వి రాముడు కోసం షోలే నుంచి కొన్ని స‌న్నివేశాల‌ను కూడా ఉప‌యోగించుకున్నారు.

అయితే సుమారుగా ఇదే సినిమా లైన్‌తో అడ‌వి నేప‌థ్యంలో వ‌చ్చిన పుష్ప‌, పుష్ప 2 రెండు చిత్రాలు క‌లుపుకుని ఏకంగా 2000 కోట్లు పైగా వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. `అడ‌వి రాముడు`లో ఎన్టీఆర్ ఫారెస్ట్ అధికారి అయితే పుష్ప‌లో పుష్ప‌రాజ్ స్మ‌గ్ల‌ర్. ఫ‌హ‌ద్ బ్యాడ్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ గా న‌టించాడు. అడ‌వి నేప‌థ్యం క‌ల‌ప స్మ‌గ్లింగ్ రెండిటిలో కామ‌న్.

ఆస‌క్తిక‌రంగా ఇప్పుడు మ‌హేష్- రాజ‌మౌళి కూడా అడ‌వుల బాట ప‌ట్టాడు. మ‌హేష్ తో సినిమాని రాజ‌మౌళి ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఇది స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా కాక‌పోయినా కానీ, ప‌చ్చ‌ని అడ‌వులు, కొండ కోన‌ల్లో సాగే క‌థాంశం. హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఇండియానా జోన్స్` లైన్ లో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ క‌థ‌తో రూపొందుతోంది.

మ‌రోవైపు బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ కూడా అడ‌వి బాట ప‌ట్టాడు. `అడ‌వి రాముడు` త‌ర‌హా సినిమాని ప్లాన్ చేసాడు. బాలీవుడ్ లో ఇటీవ‌ల అడ‌వుల్లో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్లు లేవు. అదే క్ర‌మంలో దేవ‌గ‌న్ తెలివిగా ఒక అడ‌వి యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ప్లాన్ చేసాడు. దీనిని మిషన్ మంగళ్ ఫేం జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళుతోంది. చిత్రీకరణ ప్రక్రియ ఊటీ అడవుల్లో ప్రారంభం కానుంది. ఇందులో అజ‌య్ దేవ‌గన్ రేంజ‌ర్ గా న‌టిస్తున్నాడు. అంటే అడ‌వి రాముడులో ఎన్టీఆర్ పోషించిన పాత్ర త‌ర‌హా. సంజ‌య్ ద‌త్ విల‌న్ గా అంటే (స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ త‌ర‌హా) పాత్ర‌లో క‌నిపిస్తాడు. చూస్తుంటే అడ‌వి రాముడు, పుష్ప క‌థ‌ల్ని జ‌గ‌న్ శ‌క్తి కాస్త అటూ ఇటూ మిక్స్ చేస్తున్న‌ట్టు, పాత్ర‌ల్ని అటూ ఇటూ తిర‌గేసిన‌ట్టు క‌నిపిస్తుంది. జంతు వేట‌, స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం 2026 మధ్యలో విడుదల కానుంది. 2018లో ప్రచురించిన `రేంజర్` అనే పుస్తకం నుండి ఈ సినిమా క‌థ‌ను తీసుకున్నారు. అసీమ్ అరోరా- రిచా గణేష్ ఈ న‌వ‌ల‌ను రాశారు.

తీవ్ర‌వాదుల క‌థ‌ల‌న్నీ అడ‌వుల్లోనే..

అడ‌వులు, స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఇంత‌కుముందు `కెప్టెన్ ప్ర‌భాక‌ర్` లాంటి భారీ హిట్ చిత్రం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. 90ల‌లో ఈ త‌మిళ అనువాద‌ చిత్రం తెలుగులోను విడుద‌లై అద్భుతంగా ఆడింది. విజ‌య్ కాంత్ ఈ చిత్రంలో న‌టించాడు. మూడు రాష్ట్రాల్ని గ‌డ‌గ‌డ‌లాడించిన వీర‌ప్ప‌న్ క‌థ‌ను స్ఫూర్తిగా తీసుకుని దీనిని రూపొందించారు. ఇక వీర‌ప్ప‌న్ పై తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ అడ‌వులు, స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News