విశాల్ మరో యుద్దానికి తెర తీసాడా?
దీంతో విశాల్ అవినీతిని ప్రోత్సహించే వ్యక్తికాదంటూ...రియల్ హీరో అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేసారు.
`మార్క్ ఆంటోనీ` హింది రిలీజ్ విషయంలో నటుడు విశాల్ ముంబై సెన్సార్ కి లంచం ఇవ్వాల్సి వచ్చిందని చేసిన ఆరోపణలు ఎంత సంచలమయ్యాయో తెలిసిందే. డబ్బులిచ్చి మరీ ట్విటర్ వేదికగా విషయం చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి విచారించాలని ఆదేశించింది. తన పరిస్థితే ఇలా ఉందంటే? చిన్న నిర్మాతల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందని ఈ విషయంలో చట్టపరంగా పోరాట చేస్తాననని... నీతి..న్యాయమే గెలుస్తుందని విశాల్ ప్రకటించడం తెలిసిందే.
దీంతో విశాల్ అవినీతిని ప్రోత్సహించే వ్యక్తికాదంటూ...రియల్ హీరో అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేసారు. తాజాగా విశాల్ మరో యుద్దానికి తెర తీసినట్లు కనిపిస్తుంది. ఏకంగా సినీ-రాజకీయంగా అంగ బలమున్న వ్యక్తినే ఢీకొట్టడానికి ఎదురెళ్తున్నాడు. తమిళనాడులో ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గుత్తాదిపత్యాన్ని ఇకపై భరించేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కోలీవుడ్ లో పేరు మోసిన పంపిణీ కంపెనీ రెడ్ జెయింట్ ఫిలింస్ పై శమర శంఖం పూరించాడు. ఈ సంస్థ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆధ్వర్యంలో నడుస్తుంది.
గతకొంత కాలంగా ఈ సంస్థ ఏకఛత్రాధిపత్య ధోరణిలో ప్రవర్తిస్తోందని అన్ని రకాల బలాలు ఈ సంస్థకు ఉండటంతో ఎవరూ ఏమీ అనడం లేదని..మార్క్ ఆంటోనీ రిలీజ్ సమయంలో తనను సైతం ఇబ్బందులు పెట్టాడని అన్నారు. ఏప్రిల్ 26న రిలీజ్ అవుతున్న `రత్నం` సినిమాకి అడ్డంకులు సృష్టించినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డాడు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రెడ్ జాయింట్ పై చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి.
కానీ తెగించి వాటిని ఎవరూ మీడియా ముందుకొచ్చి చెప్పలేదు. తొలిసారి విశాల్ ముందుకు రావడంతో సన్నివేశం రసవత్తరంగా మారింది. `వారసుడు` రిలీజ్ సమయంలో `తెగింపు` సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించడం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆ కారణంగా నిర్మాత దిల్ రాజు ఇబ్బందు పడాల్సి వచ్చిందని అప్పట్లో కథనాలొచ్చాయి. మరి విశాల్ తాజా వ్యాఖ్యలపై రెడ్ జాయింట్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.