టాలీవుడ్‌లో కోటి అందుకున్న తొలి కథానాయిక?
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకి 12కోట్లు అందుకుందన్న కథనాలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి.;
నేటితరంలో దీపిక పదుకొనే, ఆలియా భట్, కత్రిన కైఫ్, కియరా అద్వానీ లాంటి కథానాయికలు ఒక్కో సినిమాకి 10కోట్లు పైగా పారితోషికాలు అందుకుంటున్నారు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమాకి 12కోట్లు అందుకుందన్న కథనాలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి.
అయితే టాలీవుడ్ లో కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొట్ట మొదటి కథానాయిక ఎవరు? అంటే... ఇలియానా అంటూ ప్రచారం ఉంది. దేవదాస్ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఇలియానా, ఖతర్నాక్ చిత్రంతో కోటి పారితోషికం అందుకుందని, జనరేషన్ స్టార్స్ లో కోటి అందుకున్న మొట్టమొదటి నటి ఇలియానా అంటూ ప్రచారమవుతోంది.
అయితే ఇది నిజమా?.. అంటే... తెలుగు చిత్రసీమలో కోటి పారితోషికం అందుకున్న మేటి కథానాయిక ఎవరో మరింత వివరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. నాటి మేటి దిగ్గజ నటి భానుమతి రామకృష్ణ కోటి అందుకున్న క్లాసిక్ డే నటి అంటే అతిశయోక్తి కాదు. ఈ దివంగత నటి భారతీయ సినిమాని ఏలిన మేటి ప్రతిభావని. తెలుగు చిత్రపరిశ్రమలో నాటి మేటి కథానాయికగా భానుమతి పాపులరయ్యారు. ఆ రోజుల్లో తెలుగు చిత్రపరిశ్రమలో ఆమె పేరు ధైర్యానికి ప్రతీక. ఆ పేరులోని గాంభీర్యానికి తగ్గట్టే పరిశ్రమను శాసించారు. నాటి మేటి కథానాయికగానే కాదు.. రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేతగాను సుప్రసిద్ధులు. బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా భానుమతి పేరు మార్మోగింది. ఆమె క్రమశిక్షణ కూడా అందరికీ ఆదర్శం.
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 1924 సెప్టెంబర్ 7న ఆమె జన్మించారు. వరవిక్రయం (1939) చిత్రంతో తెరకు పరిచయమయ్యాక, పలు చిత్రాలు చేసినప్పటికీ.. `కృష్ణప్రేమ` (1943) ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన పాలువాయి రామకృష్ణతో ప్రేమాయణం పెళ్లి అప్పట్లో సంచలనం. ఇంట్లో వారికి చెప్పకుండా 20 వయసులోనే ఆయనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాతా బిజీ నాయికగా మారారు. చండీరాణి, చింతామణి, వివాహబంధం, అమ్మాయి పెళ్లి లాంటి వరుస విజయాలతో అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లతో కలిసి నటించారు. ఎన్టీఆర్ తో మల్లీశ్వరి క్లాసిక్ డే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భానుమతి నటించిన ఆఖరి చిత్రం 1998లో వచ్చిన `పెళ్లికానుక`. 60 ఏళ్ల సుదీర్ఘ నటనా జీవితంలో సంచలనాలు ఎన్నో. భానుమతి.. 2005, డిసెంబర్ 25న కన్నుమూశారు.
ఆరోజుల్లో మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.90గా ఉన్నప్పుడు భానుమతి ఒక్కో సినిమాలో నటించేందుకు రూ.25,000 వసూలు చేసేవారు. నేటి లెక్కల్లో చూసుకుంటే దాని విలువ దాదాపు రూ.2 కోట్లు. నాటి కాలాన్ని నేటి రోజులతో పోల్చి చూస్తే.. నేటితరం నటీమణులు అంత పెద్ద మొత్తం అందుకోలేరు ఎప్పటికీ.