'హాయ్ నాన్న' మూవీ రివ్యూ
నటీనటులు: నాని- మృణాల్ ఠాకూర్ - బేబీ కియారా- జయరాం- అంగద్ బేడి- శ్రుతి హాసన్- ప్రియదర్శి- విరాజ్ అశ్విన్ తదితరులు
సంగీతం: అబ్దుల్ హేషమ్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
మాటలు: నాగేంద్ర కాశీ
నిర్మాతలు: మోహన్ చెరుకూరి- విజేందర్ రెడ్డి
రచన - దర్శకత్వం: శౌర్యువ్
సినిమా సినిమాకు వైవిధ్యం చూపించే యువ కథానాయకుడు నాని.. దసరా లాంటి ఊర మాస్ సినిమా తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈరోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
కథ:
విరాజ్ (నాని) ముంబయిలో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. అతడికి తన కూతురు మహి (కియారా) అంటే ప్రాణం. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న కూతురిని విరాజ్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తన భార్యకు సంబంధించి ఒక చేదు గతం అతడిని వెంటాడుతూ ఉంటుంది. తన తల్లి గురించి కూతురు ఎప్పుడు అడిగినా దాటవేస్తూ వచ్చినా అతను.. చివరికి యశ్న (మృణాల్ ఠాకూర్) సాయంతో తన గతాన్ని కూతురికి చెప్పడం మొదలు పెడతాడు. అతడి గతంలో యశ్న పాత్ర కూడా ఉంటుంది. ఇంతకీ విరాజ్ ను వెంటాడుతున్న ఆ చేదు గతం ఏంటి.. కూతురికి దాని గురించి చెప్పాక అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.
కథనం- విశ్లేషణ:
ప్రేమకథలతో ముడిపడ్డ ఎమోషనల్ డ్రామాలకు కావాల్సిందల్లా అందమైన ప్రేమజంట.. వాళ్ళ నుంచి ఆ పాత్రలను ఎలివేట్ చేసే చక్కటి నటన.. ప్లెజంట్ విజువల్స్.. హృద్యమైన సంగీతం.. కొన్ని బ్యూటిఫుల్, ఎమోషనల్ మూమెంట్స్.. ఇవన్నీ ఉన్న ఫీల్ గుడ్ సినిమానే.. హాయ్ నాన్న. లవ్ స్టోరీల్లో కథ పరంగా ఎప్పుడో కానీ కొత్తదనం చూడలేం. హాయ్ నాన్నలో కూడా ఒక కొత్త కథను చూస్తున్న ఫీలింగ్ ఏమి కలగదు. చాలాసార్లు చూసిన కాన్ఫ్లిక్ట్ పాయింటే ఇందులోనే ఉంది. నరేషన్ కూడా నెమ్మదిగానే అనిపిస్తుంది కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వర్కౌట్ కావడంతో.. ఎమోషన్లు కూడా పండడంతో ఈ జానర్ ఇష్టపడే వాళ్లకు సినిమా కూడా నచ్చుతుంది.
నాని- ఫాదర్ ఎమోషన్ అనగానే గుర్తొచ్చే సినిమా.. జెర్సీ. దానికి హాయ్ నాన్న ఒక స్పిన్నాఫ్ లాగా అనిపిస్తుంది. అక్కడ తండ్రి కొడుకుల ఎమోషన్ మీద కథ నడిస్తే.. ఇక్కడ తండ్రి కూతుళ్ల బంధం నేపథ్యంలో కథ సాగుతుంది. జెర్సీలో మాదిరి కెరీర్ - లక్ష్యం అని కాకుండా.. ప్రేమ- వివాహ బంధాల నేపథ్యంలో ఒక భావోద్వేగ ప్రయాణాన్ని చూపించడానికి ప్రయత్నించాడు కొత్త దర్శకుడు శౌర్యువ్. తెలిసిన కథ, సన్నివేశాలనే అందంగా.. హృద్యంగా చెప్పడంలో అతను విజయవంతం అయ్యాడు. అతను ప్రధాన పాత్రలను ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగాడు. వాటితో పాటు ప్రయాణం చేస్తుంటే.. కథనం నెమ్మదిగా ఉన్నా అది పెద్ద సమస్యగా అనిపించదు.
హాయ్ నాన్న మొదలయ్యే తీరు చూస్తేనే.. ఒక స్లో రైడ్ కు ప్రేక్షకులు మానసికంగా సిద్ధమైపోతారు. పాత్రల పరిచయం.. కథ ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు. అందమైన హృదయమైన సన్నివేశాలతో తండ్రి కూతుళ్ల పాత్రలతో ప్రేక్షకులు ప్రేమలో పడేలా చేయగలిగాడు. కొంచెం నెమ్మదిగా అనిపించే కథనం కథానాయక పాత్ర రంగప్రవేశంతో ఊపందుకుంటుంది. ఫ్లాష్ ప్యాక్ లో ప్రేమ కథలో సన్నివేశాలు కొత్తగా లేకపోయినా నాని- మృణాల్ జంట చూడముచ్చటగా ఉండడం.. విజువల్స్, మ్యూజిక్ మంచి ఫీల్ ఇవ్వడంతో కథనం హాయిగా సాగిపోతుంది. కథ పరంగా ఇంటర్వెల్ సమయానికి కానీ మలుపు కనిపించదు. అది ప్రేక్షకులు ఊహించలేనిది ఏమీ కాదు కానీ ద్వితీయార్థం మీద ఆసక్తి పెంచుతుంది.
హీరో హీరోయిన్ల మధ్య దూరం రావడానికి చూపించిన కారణం కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. అయితే చాలా ప్రేమ కథలలో మాదిరే.. ఎడబాటు తర్వాత రీ యూనియన్ అనే రొటీన్ టెంప్లేట్లో కథ నడవడంతో ద్వితీయార్థం ఒక దశ వరకు మామూలుగా అనిపిస్తుంది. కూడా మరీ నెమ్మదించడం, హీరోయిన్ పాత్ర చిత్రణ గజిబిజిగా ఉండడంతో.. ఒక దశలో హాయ్ నాన్న బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే చివరి అరగంటలో భావోద్వేగాలను దర్శకుడు పతాక స్థాయికి తీసుకెళ్లడం.. నాని తన పెర్ఫామెన్స్ తో సినిమాను పైకి లేపాడు. చివరి అరగంటలో ఎమోషన్లు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తాయి. మంచి ఫీల్ తో థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేస్తాయి. మొత్తంగా చూస్తే హాయ్ నాన్న.. ఫీల్, ఎమోషన్లతో ముడిపడ్డ లవ్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు బాగానే నచ్చుతుంది. కాకపోతే కొంచెం ఓపిక అవసరం.
నటీనటులు:
ఒక్కసారి వేసవిలో వచ్చిన దసరా సినిమాను గుర్తు చేసుకుని హాయ్ నాన్న థియేటర్లోకి అడుగుపెడితే నానిని చూసి అబ్బుర పడకుండా ఉండలేము. అందులో ఇందులో ఉన్నది ఒకే హీరో అంటే నమ్మబుద్ధి కాదు. పాత్రలో, నటనలో ఇంత వైవిధ్యం చూపించగలిగే హీరోలు అరుదు. నిన్ను కోరి తర్వాత మరోసారి తన నటనలో ఎమోషనల్ డెప్త్ చూపించాడు నాని ఎప్పటిలాగే తన పాత్రకు తగ్గినట్టు కొలిచినట్టు నటించాడు నాని. పతాక సన్నివేశాలలో నాని తన నాన్నతో ప్రేక్షకులు కదిలించేశాడు. కొన్నిచోట్ల సన్నివేశాలు సాధారణంగా అనిపించినా.. నాని తన నటనతో వాటిని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సీతారామం తర్వాత తన మీద నెలకొన్న అంచనాలకు తగ్గని పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించింది. ఆథర్ బ్యాక్డ్ రోల్ లో.. చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో మృణాల్ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో తన అందం యువ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నానితో ఆమె జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇక కీలకమైన పాత్రలో బేబీ కియారా కూడా క్యూట్ గా కనిపిస్తూ.. నటిస్తూ ఆకట్టుకుంది. శృతిహాసన్ క్యామియో ఏమంత ఇంపాక్ట్ వేయదు. జయరాం, ప్రియదర్శి, నాజర్, విరాజ్ అశ్విన్ సహాయ పాత్రల్లో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
ఖుషి సినిమాతో తన ప్రత్యేకతను చాటుకున్న హేషమ్ అబ్దుల్ మరోసారి మెప్పించాడు. ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీలకు తాను సరైన ఛాయిస్ అని రుజువు చేశాడు. ఖుషిలో మాదిరి పాటలకు రిపీట్ వాల్యూ లేదు కానీ ఈ సినిమాకు సరిపోయే పాటలే ఇచ్చాడు. అతడి నేపథ్య సంగీతం హృద్యంగా సాగిపోయింది. ఎమోషనల్ సీన్లను ఎలివేట్ చేయడంలో అది ముఖ్యపాత్ర పోషించింది. సాను వర్గీస్ విజువల్స్ సినిమాను అందంగా మార్చాయి. ఒక ప్లెజెంట్ ఫీల్ వస్తుంది సినిమా చూస్తుంటే. వైరా ప్రొడక్షన్స్ తొలి చిత్రంలోనే నిర్మాణ విలువల పరంగా ఒక స్థాయి చూపించారు. నాగేంద్ర కాశీ మాటలు బావున్నాయి. కొన్ని డైలాగుల్లో బావుకథ కనిపిస్తుంది. ఇక కొత్త దర్శకుడు శౌర్యువ్ తొలి చిత్రంలోని తన అభిరుచిని చాటాడు. ఒక మామూలు కథనే ఫీల్ గుడ్ స్టయిల్లో చెప్పడానికి అతను ప్రయత్నించాడు. కథకు తగ్గట్లుగా అతని నరేషన్ స్లోగా సాగింది. రచనలో అతను ఇంకొంచెం వైవిధ్యం చూపించాల్సింది. కానీ టేకింగ్ బాగుంది. ఎమోషనల్ సీన్లలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది.
చివరగా: హాయ్ నాన్న.. నెమ్మదిగా గుండె లోతుల్లోకి
రేటింగ్ - 2.75/5