బుగ్గి పాలైన ఇంటిని చూసుకుని స్టార్ హీరోయిన్ విల‌విల‌

తాజాగా న‌టి పారిస్ హిల్టన్ తన మాలిబు సముద్ర తీర ఇల్లు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ద‌హ‌న‌మ‌వ్వ‌డాన్ని టెలివిజన్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూశానని వెల్లడించారు.

Update: 2025-01-10 16:30 GMT

అమెరికా లాస్ ఏంజెల్స్ ని దావాన‌లం చుట్టేసిన సంగ‌తి తెలిసిందే. భీక‌ర‌మైన అగ్ని కీల‌ల్లో త‌గ‌ల‌బ‌డి 2000 పైగా గృహాలు నాశ‌న‌మ‌య్యాయి. ఇందులో దాదాపు 30 మంది పైగా సెల‌బ్రిటీల ఇండ్లు ఉన్నాయి. దావాన‌లం హాలీవుడ్ హిల్స్ ఏరియా వ‌ర‌కూ విస్త‌రించింద‌ని కూడా కొన్ని మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. అదంతా అటుంచితే ఇప్ప‌టికే అగ్నికి ఆహుతైన ఖ‌రీదైన సెల‌బ్రిటీ ఆస్తుల గురించి అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖ హాలీవుడ్ హీరోల త‌గ‌ల‌బ‌డిన ఇండ్ల గురించి ముచ్చ‌ట సాగుతోంది.

తాజాగా న‌టి పారిస్ హిల్టన్ తన మాలిబు సముద్ర తీర ఇల్లు లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో ద‌హ‌న‌మ‌వ్వ‌డాన్ని టెలివిజన్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూశానని వెల్లడించారు. చాలామంది సెల‌బ్రిటీల ఇండ్లు త‌గ‌ల‌బ‌డుతున్న దృశ్యాలు క‌ల‌చివేసాయని హిల్ట‌న్ వ్యాఖ్యానించారు. 43 ఏళ్ల పారిస్ హిల్ట‌న్ తన ఇన్‌స్టాలో లైవ్ న్యూస్ ఫుటేజ్‌ను పోస్ట్ చేసింది. మాటల్లో చెప్పలేనంత హృదయ విదారకంగా ఉందని త‌న బాధ‌ను వ్యక్తం చేసింది.

పారిస్ హిల్ట‌న్ త‌గ‌ల‌బ‌డిన త‌న ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించాక‌.. అదే చోట ఆల్మోస్ట్ ఏడ్చేసినంత ప‌ని చేసారు. నేను మా ఇల్లు ఉన్న‌చోటే నిల‌బ‌డ్డాను ఇప్పుడు. హృదయ విదారకం.. వర్ణించలేని దృశ్యాలు. నేను మొదటిసారి ఈ వార్తను టీవీలో చూసినప్పుడు పూర్తిగా షాక్‌కు గురయ్యాను.. జీర్ణించుకోలేక‌పోయాను. కానీ ఇప్పుడు ఇక్కడ నిలబడి నా కళ్ళతో స్వ‌యంగా చూసినప్పుడు నా హృదయం లక్షల‌సార్లు ముక్కలైపోయినట్లు అనిపిస్తోంది. ఈ ఇల్లు కేవలం నివసించడానికి ఒక ప్రదేశం కాదు. మేం కలలు కన్న ప్ర‌దేశం. మా కుటుంబానికి అత్యంత అందమైన జ్ఞాపకాలను సృష్టించిన ప్రదేశం.. ఇలా బూడిదగా మారడాన్ని చూడటం... మాటల్లో చెప్పలేనంత ఘోరంగా ఉంది`` అని ఆవేద‌న చెందారు. కార్చిచ్చులో తమ ఇళ్లను కోల్పోయిన ఇతరుల బాధను చూసి.. వారి జ్ఞాపకాలన్నీ బూడిదగా ఎలా కాలిపోయాయో చూసి హిల్టన్ వారి ప‌ట్ల‌ సానుభూతి వ్యక్తం చేసింది. ఇది నా కథ మాత్రమే కాద‌ని తెలిసి నా హృదయాన్ని మరింత బాధపెడుతుంద‌ని, చాలా మంది ప్రజలు ప్రతిదీ కోల్పోయార‌ని పారిస్ హిల్ట‌న్ త‌న‌ Xలో రాశారు.

ఇంత‌ బాధలో నేను చాలా అదృష్టవంతురాలిని. నా ప్రియమైనవారు, నా పిల్లలు, పెంపుడు జంతువులు సురక్షితం. అది చాలా ముఖ్యమైన విషయం. ఈ మంటలను ఎదుర్కోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన అగ్నిమాపక సిబ్బందికి, మొదటిగా స్పందించిన వారికి, స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు.. తెలిపారు హిల్ట‌న్. లాస్ ఏంజిల్స్ అంతటా చెలరేగిన అడవి మంటల్లో డ‌జ‌ను పైగా స్టార్ల ఇండ్లు, ఆస్తులు ఉన్నాయి. బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ, జామీ లీ కర్టిస్, జెఫ్ బ్రిడ్జెస్, జెనే ఐకో వంటి హాలీవుడ్ తారల ఇళ్లను మంట‌లు నాశనం చేశాయి దాదాపు 180,000 మంది ప్రజలను తప్పనిసరిగా త‌ర‌లించాల్సి వ‌చ్చింది.

Tags:    

Similar News