పుష్ప 3 కోసం 'బాహుబలి' కట్టప్ప...!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న 'బాహుబలి 2' ని ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా మార్చింది అనడంలో సందేహం లేదు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న 'బాహుబలి 2' ని ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా మార్చింది అనడంలో సందేహం లేదు. ఆ ప్రశ్న సమాధానం కోసం ఎంతో మంది సినిమా చూశారు, సోషల్ మీడియా అప్పట్లో ఇంత లేకున్నా ఆ ప్రశ్న ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లిందో తెల్సిందే. ఏకంగా దేశ ప్రధాని సైతం కట్టప్ప గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక సస్పెన్స్‌ను పుష్ప 2 లో పుష్ప 3 కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్, సస్పెన్స్ కి పుష్ప 3 వెంటనే చూడాలి అనేంతగా ఆసక్తి పెరుగుతుందట. దాంతో పాటు పుష్ప 2 కి అది బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌లో రెండో పార్ట్‌పై అంచనాలు పెంచుతూ పెద్ద సస్పెన్స్‌ను, ట్విస్ట్‌ను ఏమీ ప్లాన్ చేయలేదు. అయినా పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పార్ట్ 2 కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది. కానీ పుష్ప 3 కోసం ప్రతి ఒక్కరు అంతకు మించి అన్నట్లుగా ఎదురు చూసే విధంగా పార్ట్ 2లో బిగ్ సస్పెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దేవర పార్ట్ 1 లోనూ పార్ట్ 2 కోసం సస్పెన్స్‌ను ప్లాన్ చేశారు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ పుష్ప 3 సస్పెన్స్ కచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సుకుమార్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
పుష్ప 3 ని ఇటీవలే అనుకున్నారు. దర్శకుడు సుకుమార్ కి వచ్చిన కొత్త ఐడియాతో పార్ట్ 3 కి సైతం పుష్ప ను తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని నిర్మాతల్లో ఒకరు ఇటీవల చెప్పుకొచ్చారు. పుష్ప 2 సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ఈ వారంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ప్రమోషన్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన నేపథ్యంలో ప్రమోషన్ సైతం అదే స్థాయిలో చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
క్రియేటివ్ జీనియస్‌గా పేరు దక్కించుకున్న సుకుమార్ ప్రస్తుతం షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రమోషన్ ను సైతం ఆయన ప్లాన్ చేస్తున్నారు. దేశం మొత్తం పుష్ప 2 ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. కనుక అందరికీ రీచ్ అయ్యే విధంగా ట్రైలర్ ఉండటంతో పాటు, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను రూపొందించబోతున్నారు. కచ్చితంగా పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. పలు ఏరియాల్లో బాహుబలి 2 ని మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కనుక అక్కడ బాహుబలి 2 ని మించి వసూళ్లు చేయాల్సి ఉంది.
పుష్ప 3 కి అల్లు అర్జున్ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప 3 ని 2026 చివరి వరకు పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 లో ఉండే సస్పెన్స్, దానికి వచ్చిన స్పందన, ప్రేక్షకులు పుష్ప 3 ని కోరుకునే దాన్ని బట్టి ఆ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. పుష్ప ప్రాంచైజీలో ఎన్ని సినిమాలు వచ్చినా హిట్ గ్యారెంటీ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.