460 కోట్ల నికర ఆస్తులున్న టాలీవుడ్ హీరో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు విశ్వ‌విఖ్యాతం అయింది. తెలుగు చిత్రసీమ నుంచి అతడి స్థాయి అనంతంగా పెరుగుతోంది.

Update: 2024-04-15 03:51 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు విశ్వ‌విఖ్యాతం అయింది. తెలుగు చిత్రసీమ నుంచి అతడి స్థాయి అనంతంగా పెరుగుతోంది. న‌టుడిగా, బిజినెస్‌మేన్ గా అత‌డు వివిధ ద‌శ‌ల్లో ఎదుగుతున్న తీరు స్ఫూర్తిని నింపుతోంది. అత‌డు వివిధ వ్యవస్థాపక సంస్థలలో నటనకు మించి తన ప్రభావాన్ని విస్తరించాడు. అతడి నికర ఆస్తుల‌ విలువ రూ. 460 కోట్లుగా ఉంద‌నేది ఒక అంచ‌నా. తెలుగు చిత్ర‌ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా పేరుగాంచిన అల్లు అర్జున్ ఆర్థిక పోర్ట్‌ఫోలియో వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సినిమాలు, ప్ర‌క‌ట‌న‌ల‌తో పారితోషికాలు.. ప్రొడక్షన్ హౌస్, ఫిలింస్టూడియో నిర్వ‌హ‌ణ‌, ఖ‌రీదైన‌ ఇల్లు, స్థ‌లాలు, ఆహా ఓటీటీ ప్ర‌చార‌క‌ర్త‌, ఇత‌ర వ్యాపారాలు, కార్లు వంటివాటితో అత‌డు ఇంత ఆస్తిని కూడ‌గ‌ట్టాడ‌నేది ఒక అంచ‌నా. 2022లో అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్యకు నివాళిగా హైదరాబాద్‌లో అల్లు స్టూడియోని స్థాపించాడు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియోలో ఫిల్మ్ మేకింగ్, కమర్షియల్ ప్రొడక్షన్, టెలివిజన్ ప‌రిశ్ర‌మ‌ కోసం అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. అదనంగా అల్లు కుటుంబం గీతా ఆర్ట్స్, చిత్ర నిర్మాణం - పంపిణీ సంస్థను ర‌న్ చేస్తున్నారు.

మల్టీప్లెక్స్ వ్యాపారంలోను అల్లు అర్జున్ త‌న ఖ్యాతిని విస్త‌రించారు. 2023 జూన్‌లో అల్లు అర్జున్ తన మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ ని హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలకు మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ని విస్తరించే ప్రణాళికలలు ఉన్నాయి. అలాగే బ‌న్ని రెస్టారెంట్ బిజినెస్‌లోను ఉన్నాడు. తన సినిమాల‌తో పాటు, హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా హోట‌ల్ రంగంలోకి అడుగుపెట్టాడు.

ప్ర‌క‌ట‌న‌ల రంగంలోను అత‌డు తోపు. KFC, ఫ్రూటీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ దేశీయ అంతర్జాతీయ బ్రాండ్‌లతో కాంట్రాక్టులు ఉన్నాయి. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం గణనీయమైన రుసుమును వ‌సూలు చేస్తున్నాడు. అతని ఆర్థిక పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయ‌డంలో ప్ర‌క‌ట‌న‌లు స‌హ‌క‌రిస్తున్నాయి.

డిజిటల్ ల్యాండ్‌స్కేప్ లో ఆహాతో త‌న‌దైన ముద్ర వేసాడు అల్లు అర్జున్. తెలుగు- తమిళ కంటెంట్‌ను అందించే OTT ప్లాట్‌ఫారమ్ అయిన `ఆహా`కు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను పోషిస్తున్నాడు. జూపల్లి రామేశ్వర్ రావు సహకారంతో అతడి తండ్రి అల్లు అరవింద్ స్థాపించిన ఆహా, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నిరంత‌రం ఎదుగుతోంది.

వ్యూహాత్మక పెట్టుబడుల విష‌యంలో తనదైన ప్ర‌ణాళిక‌తో దూసుకెళుతున్న అల్లు అర్జున్ హెల్త్‌కేర్ రంగంలోకి అడుగుపెట్టాడు. కాల్‌హెల్త్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లు, నర్సింగ్ కేర్, మెడిసిన్ డెలివరీ సహా అనేక రకాల వైద్య సేవలను అందిస్తోంది.

రోజు రోజుకి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ అల్లు అర్జున్ తన ఆన్‌లైన్ ఉనికిని ప్రాయోజిత పోస్ట్‌ల ద్వారా ఆదాయ మార్గాల‌ను అన్వేషించాడు. లాభదాయకమైన ప్రచార అవకాశాలను సంపాదించడానికి తన 25 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల (2.5 కోట్ల మంది)ను ఉపయోగించుకుంటున్నాడు.

ఈ విభిన్న ఆదాయ వనరుల ద్వారా అల్లు అర్జున్ సంపదల ఎదుగుదల కొన‌సాగుతోంది. తెలుగు సినిమా న‌టుడు నిర్మాత‌గానే కాకుండా వ్యాపార - వ్యవస్థాపకత రంగాలలో కూడా పాపుల‌ర్ ఫేస్ గా ఎదుగుతున్నాడు. త్వ‌ర‌లోనే 500 కోట్లు అంత‌కుమించిన ఆస్తుల‌తో టాలీవుడ్ లో గొప్ప నిక‌ర ఆస్తులు క‌లిగి ఉన్న హీరోగా అత‌డు త‌న‌కంటూ ఒక చ‌రిత్ర‌ను లిఖిస్తున్నాడు.

Tags:    

Similar News