82 ఏళ్ల వయసులో ఏం చేస్తా అనుకోవద్దు
భారత చలన చిత్ర ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లండన్‌లో నిర్వహించిన సింఫోని షోకి అభిమానుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది.;
భారత చలన చిత్ర ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లండన్‌లో నిర్వహించిన సింఫోని షోకి అభిమానుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. ఆదివారం లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్‌లో పేరుగాంచిన లండన్ రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి వెస్ట్రన్ క్లాసిక్ సింఫోని మ్యూజిక్ షోను ఇళయరాజా నిర్వహించారు. ఆసియా చలన చిత్ర సంగీత దర్శకుల్లో ఇక్కడ సింఫోని ఈవెంట్ నిర్వహించిన తొలి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజానే కావడం విశేషం.
ఈ సింఫోని సక్సెస్ అవడం పట్ల ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి సింఫోని కార్యక్రమాన్ని ఆస్వాదించారని తెలిపారు. సోమవారం స్వదేశానికి విచ్చేసిన ఇళయరాజాకు చెన్నై విమానాశ్రయంలో ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ సంగీతానికి వయస్సుతో సంబంధం లేదని, 82 ఏళ్ల వయస్సులో తాను ఏం చేస్తానని అనుకోవద్దు అని, తన అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పాడు.
ఈ సింఫోని కార్యక్రమానికి ఇది ఆరంభం మాత్రమేనని, త్వరలోనే దుబాయ్, పారిస్‌లో కూడా ఈ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని ఇళయరాజా తెలిపాడు. మొత్తం 13 దేశాల్లో ఈ సింఫోని కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒప్పందాలు జరిగాయని చెప్పాడు. తనను అభిమానించే వాళ్లు ఈ సింఫోని కార్యక్రమాలను ఫోన్లు, ఇతర డిజిటల్ మీడియా ద్వారా డౌన్‌లోడ్ చేసి కాకుండా నేరుగా కార్యక్రమానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించాలని ఇళయరాజా కోరాడు.
ఇక, 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ లెజెండ్ ఏడు వేలకు పైగా పాటలకు బాణీలు అందించడం తెలిసిందే. ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో జీవితం ఆధారంగా బయోపిక్‌ను నిర్మించేందుకు ఆ మధ్య సన్నాహకాలు జరిగాయి. ఒక భారీ నిర్మాణ సంస్థ ధనుష్‌ను హీరోగా పెట్టి ఈ సినిమాను తీసేందుకు కసరత్తు ప్రారంభించింది. కానీ తర్వాత ఈ బయోపిక్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం ఇళయరాజా అభిమానులను నిరాశపర్చింది.