ఇండియన్ 2 ఓటీటీ వచ్చేది ఎప్పుడు?
రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకుల విమర్శలకి గురైంది.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇండియన్ 2 మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 28 ఏళ్ళ క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే మొదటి సినిమాతో వచ్చిన అంచనాలని ఇండియన్ 2 ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఆ సినిమా దరిదాపుల్లో కూడా సీక్వెల్ స్టోరీ లేదనే విమర్శలు వచ్చాయి. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకుల విమర్శలకి గురైంది.
శంకర్ కి రోబో సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. అతని మీద ఆడియన్స్ కి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వాటిని అందుకోలేకపోతున్నారు. అలాగే హెవీ బడ్జెట్ లతో కథలు చెప్పడం వలన మూవీకి టాక్ బాగున్న కలెక్షన్స్ మాత్రం రాకపోవడంతో ఐ, 2.ఓ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇండియన్ 2 పరిస్థితి వేరు. ఈ సినిమా కథ కూడా ప్రేక్షకులకి నచ్చలేదు. అస్సలు ఇలాంటి ఆర్డినరీ స్టోరీని ప్రేక్షకులు శంకర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేదు.
250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా 150 కోట్ల కలెక్షన్స్ కి పరిమితం అయ్యింది. కమల్ హాసన్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఇండియన్ 3 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ కావడంతో ఇండియన్ 3పైన పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది.
రిలీజ్ తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి నెట్ ఫ్లిక్స్ తన డీల్ విషయంలో వెనక్కి తగ్గిందని, అనుకున్న ఎమౌంట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదనే టాక్ వినిపించింది. ఈ కారణంగా ఇండియన్ 2 మూవీ డిజిటల్ రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడిచింది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఇండియన్ 2 మూవీ ఆగష్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని టాక్.
థియేటర్స్ లోనే మూడు గంటల నిడివి గల ఈ సినిమాని ప్రేక్షకులు చూడలేకపోయారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయితే అందులో తప్పులని క్షుణ్ణంగా పరిశీలించి ఎత్తి చూపించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మూవీస్ డిజాస్టర్ అయితే సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసేవారు రకరకాలుగా ట్రోల్స్ చేస్తారు. చిరంజీవి గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలకి ట్రోల్స్ తప్పలేదు. ఇండియన్ 2 కూడా ఈ ట్రోల్స్ నుంచి తప్పించుకోలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది.