అవార్డ్ విన్నింగ్ నటుడి 7వ తరగతి పరీక్ష!
అలా ఇప్పటికి కూడా సీనియర్ నటీ నటులు చాలా మంది ఎక్కువ చదువుకోని వారు ఉన్నారు.
ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీకి ఉన్నత చదువులు చదివిన వారు, లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగాలు చేసే వారు వస్తున్నారు. కానీ పాతిక ముప్పై ఏళ్ల క్రితం అంతకు ముందు నటీ నటులు పెద్దగా చదువుకున్న వారు కాదు. చాలా మందికి మినిమం చదువు వచ్చి ఉండేది కాదు. సినిమాలపై ఆసక్తితో చాలా మంది చదువు మానేసిన వారు ఉన్నారు. కొందరు ఇంట్లో పరిస్థితుల కారణంగా రంగస్థలం పై నటించిన వారు ఉన్నారు. అలా ఇప్పటికి కూడా సీనియర్ నటీ నటులు చాలా మంది ఎక్కువ చదువుకోని వారు ఉన్నారు.
మలయాళ నటుడు ఇంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈయన వయసు 68 ఏళ్లు. చిన్న వయసులో కనీసం వేసుకోవడానికి బట్టలు లేక, కొనడానికి బుక్స్ లేక పోవడంతో నాలుగవ తరగతిలోనే చదువును ఆపేశాడు. చిన్న వయసులోనే ఏదో ఒక పని చేయడం మొదలు పెట్టి, టైలర్ గా స్థిర పడ్డాడు. ఆయన లో ఉన్న నటన ఆసక్తి తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 1980 నుంచి ఇంద్రన్ మలయాళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన '2018' సినిమా లో ఆయన పోషించిన పాత్రకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఇంద్రన్ చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ అసంతృప్తిగానే ఉన్నాడట. అందుకే ఆయన ఇటీవల 10వ తరగతి పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే మళ్లీ చదువుకోవడం కోసం స్కూల్ బాట పట్టాడు. తాజాగా పరీక్ష కూడా రాసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
పదవ తరగతి అయినా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ఇంద్రన్ ఇటీవల 7వ తరగతి పరీక్షలు రాశాడు. కేరళ లో 7వ తరగతి లో పాస్ అయిన వారికి మాత్రమే 10వ తరగతి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కనుక ముందు ఇంద్రన్ 7వ తరగతి పరీక్ష లు రాస్తున్నాడు. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు రాస్తాడట. ఈ వయసులో ఆయనకు చదువుకోవాలని కోరిక కలగడం ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇంద్రన్ 7వ తరగతి ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.