కన్ఫ్యూజ్డ్‌ కల్ట్‌ సినిమా రీ రిలీజ్‌.. ఇండియాలో లక్ష టికెట్లు

హాలీవుడ్‌ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లర్‌' సినిమాను ఫిబ్రవరి 7న ఇండియాలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

Update: 2025-01-22 07:30 GMT

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు, సూపర్‌ హిట్ సినిమాల రీ రిలీజ్ వార్తలను ఎక్కువగా వింటున్నాం. టాలీవుడ్‌లో గత ఏడాది అత్యధికంగా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలకు అనూహ్య స్పందన దక్కించుకున్నాయి. ఒరిజినల్‌ రిలీజ్ టైంలో కంటే రీ రిలీజ్ టైంలో ఎక్కువగా క్రేజ్ దక్కించుకున్న సినిమాలు సైతం కొన్ని ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున పాజిటివ్‌ స్పందన దక్కించుకోలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే మరో కల్ట్‌ హిట్ బొమ్మ రీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈసారి హాలీవుడ్ మూవీ కావడం విశేషం.

హాలీవుడ్‌లో సినిమాలు రీ రిలీజ్ కావడం చాలా కామన్‌ విషయం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి కాకుండా సందర్భానుసారంగా కొన్ని దేశాల్లో కొన్ని సార్లు అన్నట్లుగా రీ రిలీజ్ చేస్తారు. హాలీవుడ్‌ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లర్‌' సినిమాను ఫిబ్రవరి 7న ఇండియాలో రీ రిలీజ్ చేయబోతున్నారు. 2014లో విడుదల అయిన ఈ సినిమాకు ఇండియాలో నెగిటివ్ టాక్ వచ్చింది. హాలీవుడ్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినా ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రం ఇదేం స్క్రీన్‌ప్లే అంటూ కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లాప్‌ చేశారు. కట్‌ చేస్తే సినిమా పదేళ్ల తర్వాత రీ రిలీజ్ అనగానే టికెట్లు బుక్ చేస్తున్నారు.

'ఇంటర్‌ స్టెల్లర్‌' సినిమా ఇండియాలో విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఇప్పటికే దాదాపుగా లక్ష టికెట్లు ఆన్‌ లైన్ ద్వారా బుక్‌ అయ్యాయి. సినిమా కేవలం వారం రోజులు మాత్రమే ఇండియాలో స్క్రీనింగ్‌ ఉంటుంది. కనుక వారం రోజుల్లోనే సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అత్యధికంగా టికెట్లు బుక్ చేస్తున్నారు. విడుదల సమయం వరకు అడ్వాన్స్ బుకింగ్‌ సంఖ్య 1.5 లక్షలకు చేరే అవకాశాలు లేకపోలేదు అనే టాక్‌ వినిపిస్తుంది. హైదరాబాద్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాను చూసేందుకు దాదాపుగా 10 వేల మంది తమ టికెట్‌ను బుక్‌ చేసుకున్నారు. వీకెండ్‌లో ఎక్కువ టికెట్లు బుక్‌ అయ్యాయని తెలుస్తోంది.

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాథ్యు మెక్‌ కానవె నటించారు. భూమి మీద మానవాళి నాశనంకు ఏదైనా ముప్పు వచ్చినప్పుడు మరెక్కడైనా జీవించడానికి అనువైన స్థలం ఉందా అనే పరిశోదనలు జరపడం కోసం నలుగురు వ్యోమగాములు సిద్ధం అవుతారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, మానవాళికి కొత్త నివాసయోగ్యమైన ప్రాంతాన్ని వారు గుర్తించారా అనేది కథ. వార్నర్‌ బ్రదర్స్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా విడుదలైన సమయంలో దాదాపుగా 660 మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పలు సార్లు రీ రిలీజ్ అయ్యి మరో వంద మిలియన్ డాలర్లను రాబట్టింది. అంతే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్‌లో అప్పట్లోనే ఈ సినిమా ఆస్కార్‌ అవార్డ్‌ని దక్కించుకుంది. అందుకే సినీ ప్రేమికులు, ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమా ప్రేమికులు ఇండియాలో ఈ సినిమా రీ రిలీజ్ అనగానే టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News