సంక్రాంతికి వస్తున్నాం పైరసీ: ఊరి మధ్యలోనే ఓపెన్ షో..
సినిమా పరిశ్రమలో పైరసీ సమస్య కొత్తది కాదు, కానీ ఇటీవల సినిమాల పైన జరుగుతున్న ఈ చర్యలు పరిశ్రమను నష్టపరిచే విధంగా మారుతున్నాయి.
సినిమా పరిశ్రమలో పైరసీ సమస్య కొత్తది కాదు, కానీ ఇటీవల సినిమాల పైన జరుగుతున్న ఈ చర్యలు పరిశ్రమను నష్టపరిచే విధంగా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై జరిగిన తాజా పైరసీ దాడి, మరోసారి ఈ సమస్యను ప్రధానమైన చర్చగా నిలిపింది. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ భారీ హిట్ చిత్రం, విడుదలైన మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రికార్డులు సృష్టించినప్పటికీ, ఈ పైరసీ సంఘటన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి షాక్ కు గురి చేసింది
సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వీడియోలో, ఒక గ్రామం మొత్తమంతా ఓపెన్ స్క్రీన్ పై ఈ చిత్రాన్ని చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఎక్కడీ సంఘటన జరిగిందో తెలియకపోయినా, ఈ వీడియో పరిశ్రమలో ఆందోళన రేపుతోంది. ఈ సంఘటనపై నిర్మాతల స్పందన రావాల్సి ఉందని అభిమానులు కోరుతున్నారు. పైరసీ చేసి చిత్రాన్ని ప్రదర్శించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
అలాంటి సంఘటనలు చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించినప్పటికీ, ఇటువంటి సంఘటనలు రాబోయే కలెక్షన్లపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఒక గ్రామం మొత్తంగా సినిమా చూసినట్లు తెలిసినప్పటి నుంచి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ ట్రాక్ ను చూసుకుంటే, తొలివారంలోనే ₹203 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇది ఒక రీజనల్ చిత్రానికి ప్రత్యేకమైన రికార్డు. వేంకటేష్ నటన, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ, చిత్రానికి ప్రధాన బలాలు అయ్యాయి. అయితే, ఈ పైరసీ సంఘటనలు చిత్ర నిర్మాణ సంస్థకు ఆర్థిక నష్టాలను తీసుకురావడం ఖాయం.
పైరసీ నివారణ కోసం, డిజిటల్ మాధ్యమాలను పటిష్టంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిత్రం విడుదల సమయంలోనూ, పైరసీ అరికట్టే చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ విషయంలో నిర్మాతలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయాలని పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు. అయితే గతంలో కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇటువంటి సంఘటనలు సినిమా పరిశ్రమకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. మరి SVC ప్రొడ్యూసర్స్ ఈ ఘటనపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.