అక్టోబర్‌లో అమీర్ ఖాన్ కూతురు పెళ్లి?
ఇరా ఖాన్ - నుపుర్ శిఖరేలు అక్టోబర్ 3న కోర్టు వివాహానికి సిద్ధమవుతున్నారని, ఆ తర్వాత ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందని ఇప్పటికే కథనాలొచ్చాయి.
అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఇరా తన జిమ్ కోచ్ నూపూర్ శిఖారేతో ప్రేమలో పడింది. ఈ జంట 18 నవంబర్ 2022న నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. ప్రస్తుతం ప్రేమైక జీవనంలో ఈ జంట సంతోషంగా జీవిస్తోంది. ఇంటర్నెట్లో పెళ్లి తేదీ గురించి రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీని గురించి ఇరువర్గాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.
ఇరా ఖాన్ - నుపుర్ శిఖరేలు అక్టోబర్ 3న కోర్టు వివాహానికి సిద్ధమవుతున్నారని, ఆ తర్వాత ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందని ఇప్పటికే కథనాలొచ్చాయి. అయితే నిజం ఏమిటో చెప్పేందుకు ఇరా ఖాన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ప్రవేశించింది. అక్టోబర్ 3 వివాహ తేదీని ఇరా ఖాన్ ఖండించింది. ''లేదు లేదు, అక్టోబర్ 3న పెళ్లి చేసుకోవడం లేదు! తర్వాత ఏ తేదీనో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటివి చెప్పడానికి నేను చాలా ఉత్సాహంగా ఉంటాను. మీరు దీనిని గమనించకపోతే కష్టం. @నూపూర్_పొపాయ్'' అంటూ వ్యాఖ్యను జోడించింది.
ఇదివరకూ నిశ్చితార్థానికి ఇరా తల్లిదండ్రులు, అమీర్ ఖాన్ - రీనా దత్తా, అలాగే ఇరా సవతి తల్లి కిరణ్ రావు సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిశ్చితార్థం కోసం ఇరా స్వీట్హార్ట్ నెక్లైన్తో ఎరుపు రంగు స్ట్రాప్‌లెస్ గౌను ధరించగా, నుపుర్ పూర్తిగా నలుపు రంగు టక్సేడోలో అందంగా కనిపించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో, ఇరా ఖాన్ తాను నుపుర్ శిఖరే తమ వివాహ తేదీగా జనవరి 3ని ఎంచుకున్నామని, అయితే ఇంకా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని పేర్కొన్నారు.
ఈ జంట రొమాంటిక్ డేట్ 2022 సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. నూపూర్ ఇరాకు ఇటలీలో సినిమాటిక్ పద్ధతిలో ప్రపోజ్ చేయడంతో అసలు కథ మొదలైంది. ఇరా ఆ తర్వాత తన ఫాలోవర్స్ తో ప్రత్యేక మూవ్ మెంట్ ని షేర్ చేసుకుంది.
తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే విడిపోవడంతో ఇరాఖాన్ తీవ్ర డిప్రెషన్‌కి గురైంది. చాలాకాలం పాటు ఒంటరి జీవితాన్ని గడపడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. కానీ నుపూర్ శిఖారే పరిచయం ఇరాఖాన్ లో ఆనందం నింపింది. ఈ జంట చాలా సంతోషంగా ఉన్నారు. ఇరా ఇష్టాయిష్టాలను గౌరవించి అమీర్ ఖాన్- రీనా దత్తా దంపతులు ఈ పెళ్లిని ఇష్టపూర్వకంగా జరిపిస్తున్నారని మీడియాలో కథనాలొచ్చాయి.