ఫ్యాన్స్ ఆత్మహత్య వద్దు.. గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ వస్తోంది

దిల్‌ రాజు ఇటీవల మాట్లాడుతూ ట్రైలర్‌ రెడీ అయ్యింది కానీ ఇంకా ఏదో చేస్తున్నాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

Update: 2025-01-01 12:03 GMT

రామ్‌ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సాధారణంగా భారీ బడ్జెట్‌ సినిమాల ట్రైలర్స్‌ కనీసం నెల రోజుల ముందుగానే విడుదల అవుతూ ఉంటాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప 2 ఇలా ఏ సినిమాలు చూసుకున్నా విడుదలకు చాలా వారాల ముందుగానే ట్రైలర్‌లు వచ్చాయి. కానీ గేమ్‌ ఛేంజర్ విషయంలో అలా జరగలేదు. సినిమా విడుదలకు పది రోజుల సమయం లేదు. ఇంకా ట్రైలర్ రాలేదు. దిల్‌ రాజు ఇటీవల మాట్లాడుతూ ట్రైలర్‌ రెడీ అయ్యింది కానీ ఇంకా ఏదో చేస్తున్నాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

జనవరి 1న ట్రైలర్‌ వస్తుందని దిల్ రాజు హామీ ఇచ్చారు. కానీ ఆయన అన్నట్లుగా నేడు ట్రైలర్‌ విడుదల కాలేదు. ట్రైలర్‌ విడుదల చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ రామ్ చరణ్ వీరాభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో ఓపెన్‌ లెటర్‌ పోస్ట్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయినా మేకర్స్ నుంచి స్పందన లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నేడు చిరంజీవి, రేవంత్‌ రెడ్డిల చేతుల మీదుగా గేమ్‌ ఛేంజర్‌ సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేయించాలని మేకర్స్ ప్లాన్‌ చేశారని, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు అంటూ సమాచారం అందుతోంది. కానీ రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రైలర్‌ విడుదల మాత్రం ఆగదని తెలుస్తోంది.

మెగా కాంపౌండ్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ను రేపు అంటే జనవరి 2న తారీకున విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ట్రైలర్‌ను లాంచ్‌ చేయబోతున్నది ఎవరు, ఎక్కడ అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం మేకర్స్ నుంచి లీక్ అందింది. రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో డ్యూయెల్‌ రోల్‌లో నటించాడు. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాను వెంటనే చూడాలి అనేంత ఆసక్తిని కలిగించే విధంగా ట్రైలర్‌ ను రెడీ చేస్తున్నట్లుగా దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. కాస్త ఎక్కువగానే వర్క్‌ జరిగింది, ఎంతో మంది అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ రోజు రాత్రి వరకు ఫైనల్‌ ఎడిట్ జరుగుతూనే ఉంటుంది.

రామ్‌ చరణ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా తండ్రి కొడుకు గా నటించడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను దర్శకుడు శంకర్‌ తన వింటేజ్ ఫార్మట్‌లో రూపొందించాడు. కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించడం అనేది ప్రత్యేకమైన విషయం. తమన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో తమిళ స్టార్‌ దర్శకుడు ఎస్‌ జే సూర్య విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకు భారీ ఎత్తున బిజీనెస్ అవుతుందని, ట్రైలర్‌ విడుదల తర్వాత బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News