సూపర్‌స్టార్ కొడుకు పొలంలో మేకల కాపరి
అలాగే అతడు ఎగ్జోటిక్ లొకేషన్లలో ట్రెక్కింగ్ వంటి విద్యలకు ఆకర్షితుడై ఉన్నాడని అతడి సోషల్ మీడియా చూస్తే అర్థం చేసుకోవచ్చు.
డాక్టర్ కొడుకు డాక్టర్ యాక్టర్ కొడుకు యాక్టర్.. కానీ ఇక్కడ అంతా రివర్సులో ఉంది. అతడు సూపర్ స్టార్ కొడుకు అయినప్పటికీ తాను కూడా స్టార్ కావాలని కలలు కనలేదు. అతడు ఒక సాధారణ యువకుడిలా వ్యవసాయ కూలీలా జీవించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అతడు పొలానికి వెళతాడు. కూలీ చేస్తాడు. మేకలు ఆవులను మేపుతుంటాడు. ప్రకృతి సిద్ధమైన జీవితాన్ని గడిపేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. అలాగే అతడు ఎగ్జోటిక్ లొకేషన్లలో ట్రెక్కింగ్ వంటి విద్యలకు ఆకర్షితుడై ఉన్నాడని అతడి సోషల్ మీడియా చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా ఎవరి గురించి అంటే....మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఏకైక కుమారుడు ప్రణవ్ గురించే. అతడు పొలంలో కూలీగా, మేకలు, గుర్రాల పెంపకంలో బిజీగా ఉన్నాడు. మోహన్ లాల్ సహచరుడైన మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ నేడు కేవలం మాలీవుడ్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగేస్తుంటే మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ అందుకు భిన్నంగా ఉన్నాడు. అతడికి గ్లామర్ వాసన అంతగా గిట్టలేదు. రంగుల ప్రపంచం మత్తు కూడా తలకెక్కినట్టు లేదు. అందుకే అతడు ఈ పరిశ్రమకు కొంత దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు.
లాల్ వారసుడిగా అతడు చిన్నప్పుడే నటనలో ప్రతిభను కనబరిచాడు. అవార్డులు రివార్డులు అందుకున్నాడు. హీరోగాను రాణిస్తున్నాడు. హిట్లు కొడుతున్నా కానీ ఈ రంగంపై ఆసక్తి ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు.. అతడు ప్రకృతితో సమతుల్యంగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఇది నిజంగా ఒక వ్యక్తిగా అతడి సమున్నత ఆలోచనన ప్రతిబింబిస్తోంది.
చాలా మంది నటవారసులు సినీరంగంలో ప్రవేశించి ఇండస్ట్రీని ఏలాలని కలలుగంటున్నారు. కానీ అందుకు భిన్నంగా మోహన్ లాల్ వారసుడు ఆలోచిస్తున్నాడు. మనోరమ కథనం ప్రకారం..లాల్ కుమారుడు ప్రస్తుతం స్పెయిన్‌లో వ్యవసాయం చేస్తూ గడుపుతున్నాడు.
ప్రణవ్ 2003 డ్రామా చిత్రం `పునర్జని`లో బాల నటుడిగా సినీప్రవేశం చేసాడు. తొలి ప్రయత్నమే ఉత్తమ బాలనటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. మోహన్ లాల్ భార్య సుచిత్ర మనోరమ పత్రికతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కొన్ని స్క్రిప్ట్‌లు వింటున్నా కానీ.. తన కొడుకు ప్రస్తుతం సినిమాలు కాకుండా ఇతర వ్యాపకాలపై దృష్టి సారించాడని తెలిపారు. ప్రణవ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో `వర్క్ అవే` కార్యక్రమంలో పాల్గొంటున్నాడని, అక్కడ డబ్బు కోసం కాకుండా ఆహారం, వసతి కోసం పని చేస్తున్నాడని సుచిత్ర తెలిపారు.
ప్రణవ్ ఆర్థిక ప్రతిఫలం కంటే ఈ తరహా అనుభవాలకే ఎక్కువ విలువ ఇస్తాడని.. ప్రస్తుతం గుర్రాలు, మేకల సంరక్షణ వంటి పనులు చేస్తున్నాడని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. అతడు తాను ఏం చేస్తాడో దానిని నమ్ముతాడని కూడా సుచిత్ర తెలిపారు. సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు చేయమని కోరుతున్నాను. కానీ ప్రణవ్ ఎప్పుడూ వినడు. కొన్నిసార్లు అతను చెప్పింది నిజమేనని నేను అనుకుంటున్నాను. జీవితంలో సమతుల్యత ఉండాలి అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రణవ్ పరిశ్రమకు కొత్త అయినా కానీ ప్రజలు అతడిని తండ్రి మోహన్‌లాల్‌తో పోలుస్తున్నారని, అయితే అప్పు ఎప్పటికీ మోహన్‌లాల్ కాలేడు అని కూడా అన్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఏకైక కుమారుడు ప్రణవ్. ప్రణవ్ `పునర్జని`(2003)లో బాల నటుడిగా ఆరంగేట్రం చేసాడు. ఆరంభమే ఉత్తమ బాలనటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. అటుపై 2015లో జీతూ జోసెఫ్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసాడు. పాపనాశం , ది లైఫ్ ఆఫ్ జోసుట్టి అనే రెండు సినిమాలకు అసిస్టెంట్. 2018లో జీతూ దర్శకత్వం వహించిన `ఆది`లో కథానాకుడిగా నటించాడు. ఇది ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అతడి నటనకు ఉత్తమ తొలి చిత్ర నటుడిగా సైమా అవార్డు లభించింది. ప్రణవ్ ఆది చిత్రానికి గాయకుడు, గేయరచయితగా కూడా అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత హృదయం (2022)లో నటించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక కమర్షియల్ గాను విజయం సాధించింది.