ఇప్పుడు గనక 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ చేస్తే..!

దీంతో ఇప్పుడు నిర్మాత అశ్వినీ దత్ ''జగదేక వీరుడు అతిలోక సుందరి'' సీక్వెల్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారనే చర్చ నడుస్తోంది.

Update: 2024-07-07 00:30 GMT

ఇండియన్ సినిమాలో 'ఫాంటసీ' చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే 'సైన్స్ ఫిక్షన్' కథలపైనే మన దర్శక రచయితలు దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోలు సైతం అలాంటి మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిర్మాతలు బడ్జెట్ పరిమితులు పెట్టుకోకుండా కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న 'కల్కి 2898 AD' సినిమా ఇదే జోనర్ లో తెరకెక్కింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించారు. జూన్ నెలాఖరున రిలీజైన ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో ఇప్పుడు నిర్మాత అశ్వినీ దత్ ''జగదేక వీరుడు అతిలోక సుందరి'' సీక్వెల్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారనే చర్చ నడుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, దివంగత అందాల నటి శ్రీదేవి కాంబోలో వచ్చిన వెండితెర అద్భుతం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇది తెలుగు సినిమాలో ఫాంటసీ జానర్‌లో ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూమ్మీదకు వచ్చి ఒక సాధారణ మానవుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఈ అద్భుతమైన కథను, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంతే అద్భుతంగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీ దత్ నిర్మించారు. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా.. ఆ సమయంలో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం 34 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీకి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైజయంతీ సంస్థకు ఎంతో ప్రత్యేకమైన ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తామని నిర్మాత అశ్వినీ దత్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ సినిమా తీసిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకుంటానని అన్నారు. అంతేకాదు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లతో ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ క్రేజీ సీక్వెల్ మూవీపై మరోసారి నోరు విప్పారు అశ్విని దత్. తప్పకుండా ఈ సీక్వెల్ ఉంటుందని, ఇప్పుడు కల్కి పనుల్లో బిజీగా ఉన్నాం కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తామని దత్ తెలిపారు.

నిజానికి చిరంజీవి సైతం రామ్‌ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ కలిసి ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ సీక్వెల్ చెయ్యాలని కోరుకుంటున్నారు. సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ 'జగదేక వీరుడు..' పార్ట్ 2లో చరణ్-జాన్వీ కలిసి నటిస్తే చూడాలని ఉందని, దానికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. అలానే గతంలో ఓ ప్రోగ్రామ్ కు గెస్టుగా హాజరైన చిరంజీవి.. ఈ మూవీని తన కుమారుడు, శ్రీదేవి కూతుర్లతో రీమేక్ చేస్తే బాగుంటుందని అన్నారు.

రామ్‌ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత ఎప్పటికైనా చెర్రీ - జాన్వీల కలయికలో ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ సీక్వెల్ వస్తుందని మెగా అభిమానులు నమ్ముతున్నారు. చిరంజీవి, అశ్వినీదత్ ల కోరిక కూడా అదే. ఎలాగూ అశ్వినీదత్ ఫ్యామిలీలో నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి, 'కల్కి' పార్ట్ 2 తర్వాత ఆ దిశగా అడుగులు పడొచ్చు. ఒకవేళ అదే జరిగితే మాత్రం వరల్డ్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ గురించి వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ అందుతుందేమో చూడాలి.

Tags:    

Similar News