ఐటీ దాడులు... ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న లెక్కల మాటేమిటి?
తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దిల్ రాజు, మైత్రీ మూవీస్ నిర్మాతలు ఇటీవల ప్రకటించినట్లు చెబుతున్న ‘పుష్ప-2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల కలెక్షన్స్ పైనే ఐటీ అధికారుల దృష్టి అనే చర్చ తెరపైకి వచ్చింది.
దీంతో... ఆ సినిమాల నిర్మాతలు ట్యాక్స్ కట్టిన సొమ్ముకు, పోస్టర్స్ లో చెబుతున్న కలెక్షన్స్ కు ఏమాత్రం పొంతనలేదనే కారణంతోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారమూ జరిగింది. ఈ సమయంలో.. ఈ దాడుల్లో 2020-21 మధ్యకాలానికి సంబంధించిన లెక్కల్లో తేడాలు కనిపించాయనే ప్రచారం వైరల్ గా మారింది.
అవును... టాలీవుడ్ లో జరుగుతున్న ఐటీ దాడులు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సంక్రాంతి కి విడుదలైన సినిమాలు, పుష్ప-2 కి సంబంధించిన నిర్మాతలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఓ ఎక్సెల్ షీట్ ని గుర్తించారని అంటున్నారు.
ఈ దాడులో ఓ కంపెనీకి సంబంధించిన వ్యక్తికి చెందిన ఫోన్ లో 2020-2021 కాలానికి సంబంధించిన లావాదేవీల రికార్డులు ఉన్న ఎక్సెల్ షీట్ ను ఐటీ అధికారులు గుర్తించారని.. ఈ షీట్ లో పరిశ్రమలోని పలు ప్రముఖ కంపెనీల పేర్లు ఉన్నాయని.. ఈ షీట్ బట్టి చూస్తే పెద్ద ఎత్తున డబ్బు అనధికారికంగా మార్పిడి జరిగినట్లూ కనిపిస్తోందని భావిస్తున్నారట!
ఈ లెక్కలు బ్లాక్ టు వైట్ మార్పిడి ప్రక్రియలో భాగంగా జరిగిన వ్యవహారానికి సంబంధించినవి అయ్యి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న లెక్కల మొత్తం దాదాపు రూ.80 కోట్ల వరకూ ఉందని.. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. ఈ ప్రచారం వాస్తవమైతే.. ఇది కచ్చితంగా బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుంది.