మూవీ రివ్యూ : జాబిలమ్మ నీకు అంత కోపమా

Update: 2025-02-21 04:39 GMT

'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ రివ్యూ

నటీనటులు: పవిష్-అనిఖ సురేంద్రన్-ప్రియ ప్రకాష్ వారియర్-మాథ్యూ థామస్-శరత్ కుమార్-ఆడుగళం నరేష్-శరణ్య-రబియా ఖాతూన్-రమ్య రంగనాథన్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో

నిర్మాతలు: కస్తూరి రాజా-విజయలక్ష్మి

రచన-దర్శకత్వం: ధనుష్

కథ:

ప్రభు (పవిష్) ఒక షెఫ్. బ్రేకప్ అయిన తన లవ్ స్టోరీ గురించి బాధ పడుతున్న అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. పెళ్లి కూతురు తన క్లాస్ మేటే అని తెలుసుకున్న ప్రభు.. తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన లవ్ స్టోరీ గురించి ఆమెకు చెప్పడం మొదలుపెడతాడు. ప్రభును ఎంతో ఇష్టపడి తనతో పెళ్లికి సిద్ధమవుతుంది నిల. కానీ వీరి ప్రేమకు నిల తండ్రి అడ్డుగా నిలుస్తాడు. అయినా నిలనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రభు.. ఉన్నట్లుండి మనసు మార్చుకుని ఆమెను అవాయిడ్ చేయడం మొదలుపెడతాడు. తన ప్రవర్తన నచ్చక అతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన నిల.. కొన్నాళ్లకు తన శుభలేఖను ప్రభుకు పంపుతుంది. ఈ కథంతా చెప్పాక.. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి సలహాతోనే నిల పెళ్లికి వెళ్తాడు ప్రభు. ఇంతకీ నిలను గతంలో ప్రభు ఎందుకు అవాయిడ్ చేశాడు.. నిల పెళ్లికి వెళ్లి అక్కడ అతనేం చేశాడు.. అక్కడేం జరిగింది.. చివరికి వీరి జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

నటుడిగా ధనుష్ ప్రతిభ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే తనలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడని అతను ఇప్పటికే తీసిన రెండు చిత్రాలతో చాటాడు. తొలి చిత్రం 'పవర్ పాండి'లో ఒక నడివయస్కుడి కథను హృద్యంగా చెప్పి తననొక ఫ్యామిలీ సినిమాల దర్శకుడిలా పరిచయం చేసుకున్నాడు ధనుష్. ఆ తర్వాత రెండో చిత్రం 'రాయన్'తో తనలో ఒక యాక్షన్ డైరెక్టరూ ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడతను యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీలను కూడా బాగానే డీల్ చేయగలనని చాటాడు 'జాబిలమ్మ నీకు అంత కోపమా'తో. ఇదేమీ కొత్తగా అనిపించే కథ కాదు. ఇందులో గొప్ప మలుపులేమీ ఉండవు. ఎన్నోసార్లు చూసిన కథలాగే అనిపించినా.. బోర్ కొట్టించకుండా సరదాగా సాగిపోవడం దీని ప్రత్యేకత. నేటి యువత మనస్తత్వాలకు అద్దం పడుతూ.. ట్రెండీగా సాగిపోయే సన్నివేశాలు యువతకు బాగానే నచ్చుతాయి. ఓవైపు ఏముంది ఇందులో అనిపిస్తూనే.. ఇంకోవైపు ఈమాత్రం వినోదం సరిపోదా అనిపించే జాలీ టైపు టైంపాస్ సినిమా 'జాబిలమ్మ నీకు అంత కోపమా'.

ఎ యూజువల్ లవ్ స్టోరీ.. ఇదీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రానికి ధనుష్ పెట్టిన ట్యాగ్ లైన్. నిజంగా ఇదేమీ భిన్నమైన.. విశేషంగా అనిపించే ప్రేమకథ కాదు. ఒక సగటు ప్రేమకథలో ఏం జరుగుతుందో ఇందులోనూ అదే జరుగుతుంది. అబ్బాయి-అమ్మాయి అనుకోకుండా కలవడం.. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడం.. ఇంతలో అబ్బాయిని తీసుకెళ్లి తన తండ్రికి అమ్మాయి పరిచయం చేయడం.. బాగా డబ్బున్న ఆ తండ్రి జీవితంలో ఇంకా స్థిరపడని ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిని మెచ్చకపోవడం.. ఆ తండ్రి వల్ల అబ్బాయి-అమ్మాయి మధ్య బ్రేకప్ కావడం.. అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంటే అబ్బాయి తన పెళ్లికి వెళ్తే అక్కడ ఇద్దరిలోనూ రియలైజేషన్ రావడం.. ఇలా ఒక టెంప్లేట్లో సాగిపోయే సినిమా ఇది. తన నుంచి విడిపోయిన హీరోయిన్ పెళ్లికి హీరో వెళ్లాడు అంటేనే.. అక్కడ చివరికి ఎమోషనల్ గా ఏదో జరిగి ఇద్దరూ తిరిగి కలుస్తారనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుగులో ఈ తరహాలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి మరి. ఐతే ఎక్కడా కథ గురించి ఎక్కువ ఆలోచించనివ్వకుండా.. సరదా సన్నివేశాలతో కథనాన్ని పరుగులు పెట్టించడంలో ధనుష్ విజయవంతం అయ్యాడు.

మామూలుగా ప్రేమకథల్లో ఫోకస్ అంటే ప్రేమ జంట మీదే ఉంటుంది. వాళ్లే సినిమాకు ఆకర్షణ అవుతారు. లవ్ సీన్సే యువతను ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఐతే 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో మాత్రం హైలైట్ అయింది హీరో హీరోయిన్లు కాదు.. హీరో ఫ్రెండు పాత్ర చేసిన మాథ్యూ థామస్. 'ప్రేమలు' చిత్రంలో చిన్న పాత్రతోనే బాగా నవ్వించిన ఈ మలయాళ కుర్రాడు.. 'జాబిలమ్మ..' సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాడు. సినిమాలో నవ్వులు పంచే బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. అతను చేసిన రాజేష్ పాత్రే లేకుంటే ఈ సినిమా బోరింగ్ గా తయారై ఉండేదనడంలో సందేహం లేదు. ఈ పాత్ర తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు విరుస్తాయి. అంత ఫన్నీగా ఆ పాత్రను డిజైన్ చేశాడు ధనుష్. సినిమా ఎక్కడ కొంచెం డౌన్ అవుతోందన్నా.. రాజేష్ క్యారెక్టర్ అందుకుని ప్రేక్షకుల్లో జోష్ తీసుకొస్తుంది. ముఖ్యంగా గోవాలో పెళ్లి నేపథ్యంలో నడిచే ఎపిసోడ్ అంతటా రాజేష్ పాత్ర బోలెడంత వినోదాన్నందిస్తుంది. చివరి అరగంటలో కథ ఎమోషనల్ గా మారినా.. రాజేష్ పాత్ర మాత్రం ఇంకోవైపు నవ్వులు పంచుతూనే ఉంటుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియాంక మోహన్ సాంగ్ తెర మీద కూడా బాగుంది. అది వచ్చే టైమింగ్.. ఆ పాట తాలూకు జోష్ ద్వితీయార్ధానికి బలమయ్యాయి. ఐతే కథకు కీలకం అయిన ప్రేమకథను మాత్రం ధనుష్ సరిగా డీల్ చేయలేదనిపిస్తుంది. చాలా సీన్లు పైపైన లాగించేశాడు. డెప్త్ లేదు. ప్రథమార్ధంలో లవ్ స్టోరీని లైట్ గా తేల్చేయడం వల్ల.. ద్వితీయార్ధంలో ఎమోషన్ అనుకున్నంతగా పండలేదు. హీరో హీరోయిన్లు విడిపోతున్నపుడు ఒక ఫీల్ కలగనపుడు.. మళ్లీ వాళ్లిద్దరూ కలవాలనే తపన కలగడమూ కష్టమే. అందుకే పతాక సన్నివేశాలు కొంచెం నాటకీయంగా అనిపిస్తాయి. ఐతే వినోదపు మాయాజాలంలో ఇలాంటివి కొట్టుకుపోతాయి. సినిమాకు ఇచ్చిన ముగింపు కొందరికి సరదాగా అనిపించొచ్చు. అది కొందరికి అతిగానూ తోస్తుంది. అంతలోనే సీక్వెల్ ప్రకటించడంతో ధనుష్ ఇలాంటి ఎండింగ్ ఇచ్చాడేమో అని కూడా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో ధనుష్ ఒక సగటు ప్రేమకథనే వినోదపు పూతతో యూత్ కు నచ్చేలా చెప్పాడు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ వినోదం కోరుకుంటే.. ఆ మేరకు ఢోకా లేని సినిమా ఇది.

నటీనటులు:

ధనుష్ మేనల్లుడైన పవిష్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. అతను చూడ్డానికి చాలా యావరేజ్ గా అనిపిస్తాడు. ఐతే అతను చేసింది కూడా సింపుల్ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రే కావడంతో దానికి సూటయ్యాడు. పవిష్ నటన సూపర్ అనలేం. అలా అని తీసిపడేసేలా లేదు. తనకు జోడీగా నటించిన అనిఖ సురేంద్రన్.. ఇంకా చిన్న పిల్లలానే తోస్తుంది. అందుకు ఆమె బాలనటిగా చేసిన పాత్రలు గుర్తుకు రావడం కూడా కారణం కావచ్చు. పాత్రకు అవసరమైన పరిణతి అనిఖలో కనిపించదు. కొన్ని సీన్ల వరకు బాగానే చేసినా.. ఓవరాల్ గా అనిఖ పెర్ఫామెన్స్ యావరేజ్ అనిపిస్తుంది. ప్రియ ప్రకాష్ వారియర్ క్యారెక్టర్ స్క్రీన్ టైం తక్కువే కానీ.. తన పెర్ఫామెన్స్ బాగుంది. ఇక సినిమాకు రియల్ హీరో మాత్రం మాథ్యూ థాసమే. ఈ కుర్రాడి పాత్ర.. తన నటన భలే ఫన్నీగా అనిపిస్తాయి. సినిమాలో నవ్వుల క్రెడిటంతా అతడిదే. రబియా ఖాతూన్.. రమ్య రంగనాథన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. శరత్ కుమార్.. ఆడుగళం నరేన్.. శరణ్య.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్రకాష్ కుమార్ సినిమాకు సరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రియాంక మోహన్ మీద తీసిన పాట అదిరిపోయింది. దాని చిత్రీకరణ కూడా బాగుంది. మిగతా పాటలు కూడా ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం హుషారు పుట్టించేలా సాగింది. లియోన్ బ్రిట్టో కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో.. బాగానే కుదిరాయి. ఇక ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్ గా తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈసారి అతను యూత్ పల్స్ పట్టుకున్నాడు. ఒక మామూలు లవ్ స్టోరీనే తీసుకుని.. కామెడీ టచ్ తో బోర్ కొట్టించకుండా నడిపించేశాడు. నేటి తరం ప్రేమలు.. బ్రేకప్పుల గురించి బాగానే స్టడీ చేసి.. ఇప్పటి యూత్ కు నచ్చేలా సినిమా తీశాడు.

చివరగా: జాబిలమ్మ నీకు అంత కోపమా.. రొటీన్ స్టోరీనే జాలీగా

రేటింగ్- 2.75/5

Tags:    

Similar News