200 కోట్ల మోసం కేసు: కానుకలు తీసుకోవడం నేరం అని తెలీదు!
మనీలాండరింగ్ కేసులో తనపై దాఖలైన చార్జ్ షీట్‌ను ఆమె సవాలు చేశారు.
శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ పేరు కాన్‌మాన్ సుకేష్ చంద్రశేఖర్‌తో ముడిపెట్టి హెడ్ లైన్స్ లోకి రావడం సంచలనమైన సంగతి తెలిసిందే. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో బుధవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ కేసులో తనపై దాఖలైన చార్జ్ షీట్‌ను ఆమె సవాలు చేశారు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని జాక్విలిన్ పేర్కొన్నారు.
ఆమె అందుకున్న బహుమతులు నేరం చేసి సంపాదించిన దాంతో కొన్నవని జాక్విలిన్‌కు తెలియదని లాయర్ వాదించారు. విచారణ సందర్భంగా జస్టిస్ అనీష్ దయాల్ ఒక ప్రశ్న సంధించారు. ''ఒక ఎదిగిన అమ్మాయి తాను తీసుకునే బహుమతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా?'' అని ప్రశ్నను లేవనెత్తారు. తదుపరి వాదనలను నవంబర్ 26 నాటికి వాయిదా వేసారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, ప్రశాంత్ పాటిల్, శక్తి పాండేలు హాజరయ్యారు.
ఈ బహుమతులు నేరం చేసి ఆర్జించిన ఆదాయంలో భాగమని ఆమెకు తెలుసు అంటూ ఈడీ వాదిస్తోంది... కానీ అది నిజం కాదు..! సుకేష్ చంద్రశేఖర్ నుండి జాక్విలిన్ అందుకున్న బహుమతులు అదితి సింగ్ (మోసపోయిన బాధితురాలు) నుండి బలవంతంగా వసూలు చేసిన డబ్బుతో కొన్నవేనని ఆమెకు తెలియదు అని సీనియర్ న్యాయవాది వాదించారు. తప్పిదం జరిగింది.. అయితే అది చట్టవిరుద్ధమైన తప్పేమీ కాదని వాదించారు. సుకేష్ చంద్రశేఖర్ కి రాజకీయ కనెక్షన్స్ ఉన్నాయని, అతడు ఒక ఫిక్షర్ అని సహనిందితురాలు పింకీ ఇరానీ జాక్విలిన్ ని ఒప్పించారు. తన రాజకీయ కనెక్షన్స్ దృష్ట్యా జాక్విలిన్ ని బలిపశువును చేసాడని కూడా లాయర్ వాదించారు.