జైలర్ (Vs) జైలర్.. కోర్టు గడపలో పంచాయితీ
ఒకే టైటిల్ తో ఒకే రోజున రెండు సినిమాలు
ఒకే టైటిల్ తో ఒకే రోజున రెండు సినిమాలు రిలీజైతే ఆడియెన్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారా? కానీ అలాంటి సన్నివేశం ఎదురైంది. ఒకే విధమైన కథాంశం టైటిల్ తో ఒకే తేదీన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్.. ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో మలయాళంలో రూపొందించిన జైలర్ ఒకేరోజున విడుదలవుతున్నాయి. రజనీ జైలర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ జైలర్ కి సక్కీర్ మదతిల్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే మలయాళ 'జైలర్' టైటిల్ చాలా ముందే కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ అయినట్టు చిత్రబృందం వెల్లడిస్తోంది. ఒకేసారి ఒకే టైటిల్ తో రెండు సినిమాలు విడుదలైతే ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే వీలుంది. రజనీకాంత్ సినిమా మలయాళంలోను భారీగా విడుదలవుతుంది కాబట్టి తమ చిన్న సినిమాకి పెద్ద ఇబ్బంది ఏర్పడుతుందని మలయాళ నిర్మాతలు అభ్యర్థించారు.
టైటిల్ గందరగోళం నుంచి బయటపడేందుకు మలయాళంలో ప్రత్యామ్నాయ టైటిల్‌ను పరిశీలించమని సక్కీర్ మదతిల్ సన్ పిక్చర్స్‌ను అభ్యర్థించారు. అయితే సన్ పిక్చర్స్ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సన్ పిక్చర్స్ టైటిల్ క్లాష్‌కి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.
ఆగస్ట్ 2న విచారణ జరగనున్నందున మదతిల్ కూడా కోర్టులో కౌంటర్ ఫైల్‌తో సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. కోర్టు విచారణలు కొనసాగుతున్నప్పటికీ రెండు సినిమాలు వాటి విడుదల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి.
రజనీకాంత్ జైలర్ కథాంశం ఇప్పటివరకూ రివీల్ కాలేదు. నెల్సన్ ఈ సినిమాకి సంబంధించిన లీకులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మలయాళ జైలర్ ఒక ఆశాజనకమైన థ్రిల్లర్. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ జైలర్ గా నటించారు. కట్టుదిట్టమైన గట్టి భద్రత ఉన్నా జైలు నుండి తప్పించుకున్న ఖైదీల గుంపును తిరిగి పట్టుకునే లక్ష్యంతో ముందుకు సాగే జైలర్ కథాంశమిది. ఇరు సినిమాలపైనా మలయాళ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే రజనీ సినిమా టైటిల్ ని మలయాళ వెర్షన్ వరకూ మార్చుకోవాలని కోరినా దానికి సన్ పిక్చర్స్ అంగీకరించలేదు.