జక్కన్న..అపజయమెరుగని డైరెక్టర్ ఎలా అయ్యాడు?
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని రాజమౌళి ఆ క్షణం నుంచి జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టారట. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ల వద్ద శిష్యుడిగా చేరి కొన్నాళ్లు పని చేశారు
కొంత మంది ట్రెండ్ సెట్ చేస్తారు..కానీ కొంత మంది మాత్రం ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. అయితే కొంత మంది మాత్రమే ట్రెండ్‌తో పాటు చరిత్రని తిరగరాస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుంటారు. అలాంటి వారి జాబితా గురించి ప్రస్థావన వస్తే ఇండియన్ సినీ చరిత్రలో ముందుగా చెప్పుకునే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. ఒక విధంగా చెప్పాలంటే జక్కన్న ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. ఇండియన్ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి'కి ముందు..బాహుబలి`కి తరువాత అని చెప్పుకోక తప్పదు. అంతగా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా నిలబెట్టారు. సినిమాటిక్ జీనియస్‌గా పేరు తెచ్చుకుని యావత్ ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు తలెత్తి చూసేలా చేసిన రాజమౌళి పుట్టిన రోజు నేడు.
స్కూల్ రికార్డుల్లో..
రాజమౌళి కర్ణాటకలోని రాయచూర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి. కానీ ఆయన పేరు స్కూల్ రికార్డుల్లో మాత్రం మరోలా ఉండేది. అదే విజయ అప్పారావు. ఇది ఆయన తాతగారి పేరు. ఆ తరువాతే ఆయన పేరు ఎస్.ఎస్. రాజమౌళిగా మారింది. ఆయనకు మరో పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అదే జక్కన్న. ఈ పేరు పెట్టింది నటుడు రాజీవ్ కనకాల. అప్పటి నుంచి అదే పేరు కంటిన్యూ అవుతూ వస్తోంది. జక్కన్న పుస్తకాల పురుగు. సినిమాలంటే అమితాసక్తని. తాను చదివిన కథలని, సినిమాలకు క్రియేటివిటీని జోడించి తనదైన పంథాలో అబ్బుర పరిచేలా చెప్పడంతో రాజమౌళి దిట్ట. అదే ఆయనను దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించేలా చేసింది.
ఆ మాటలే జక్కన్నని మార్చేశాయి...
ఇంటర్ పూర్తి చేశాక ఖాలీగా ఉంటున్న రాజమౌళిని ఒక రోజు ఆయన వదిన, కీరవాణి వైఫ్ జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావ్? అని అడిగారట. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని రాజమౌళి ఆ క్షణం నుంచి జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టారట. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ల వద్ద శిష్యుడిగా చేరి కొన్నాళ్లు పని చేశారు. దర్శకుడు, నిర్మాత గుణ్ణం గంగరాజు ఇంట్లో ఉంటున్న సమయంలో రాజమౌళికి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో పరిచయం ఏర్పిడిందట. తరువాత ఇద్దరు కలిసి రాఘవేంద్రరావు వద్ద దర్శకత్వ శాఖలో చేరారు. రాజమౌళి తొలి సంపాదన రూ.5000. రాఘవేంద్రరావు టీడీపీ ప్రచారం కోసం ప్రకటనలు రూపొందిస్తున్న సమయంలో ఐడియా చెప్పినందుకు గానూ జక్కన్న రూ.5000 ఇచ్చారట. అదే జక్కన్న తొలి సంపాదన.
మలుపు తిప్పిన సీరియస్
జక్కన్న టాలెంట్‌ని గమనించిన రాఘవేంద్రరావు ఆయనపై ఉన్న నమ్మకంతో 'శాంతి నివాసం' సీరియల్‌తో దర్శకుడిగా పరిచయం చేశారు. దీని కోసం రాజమౌళి రోజుకు 18 గంటలు ఏడాది పాటు పని చేశారట. ఈ సీరియల్ నిర్మాణ సమయంలో జక్కన్న తపనని గమనించిన ఆర్కా మేకర్స్ ఎప్పటికైనా భారీ సినిమాని తనతో చేయాలని అప్పుడే అనుకున్నారట. అదే 'బాహుబలి' కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణంగా నిలిచిందట. శాంతి నివాసం సీరియల్ తరువాత దర్శకుడిగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా 'స్టూడెంట్ నెం.1'. రాఘవేంద్రరావు పర్యవేక్షణ కారణంగా జక్కన్నకు క్రెడిట్ దక్కపోయినా ఆయనలో టాలెంట్ ఉందని ఇండస్ట్రీ గుర్తించింది. అక్కడి నుంచి జక్కన్న ఏ సినిమా చేసినా తన ఫ్యామిలీ మెంబర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ తిరుగులేని విజయాలని తన ఖాతాలో వేసుకుంటూ అపజయమెరుగని దర్శకుడు అనిపించుకున్నారు.
'ఈగ'తో మొదలై...
'బాహుబలి'తో ఇండియన్‌సినిమా రూపు రేఖలు మార్చిన జక్కన్న అసలు ఆలోచనకు బీజం వేసింది 'ఈగ'. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, హీరోనే లేకుండా కేవలం 'ఈగ'ని ప్రధాన వస్తువుగా చేసుకుని రాజమౌళి తెరకెక్కించిన ప్రతీకార చిత్రం ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. కథని నమ్మి ముందుకు వెళితే ఎలాంటి ఫలితాలని సాధించవచ్చో ఈ సినిమాతో నిరూపించిన జక్కన్న అప్పుడే 'బాహుబలి'కి బాటలు వేసుకున్నారంటారు సినీ జనం. రెండు జన్మల కథగా 'మగధీర'ని తెరకెక్కించిన జానపద, చారిత్రాత్మక చిత్రాలతో ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేయవచ్చని నిరూపించారు. ఈ సినిమాని కూడా 'బాహుబలి' ప్రాజెక్ట్‌కు ఓ ట్రయల్ ప్రాజెక్ట్‌గా భావించారనే కామెంట్‌లు కూడా ఆ తరువాత వినిపించాయి.
'బాహుబలి'తో అద్భుతం చేశారు.
ఏ దర్శకుడు చేయని, ఊహించని సాహసం 'బాహుబలి'. తెలుగు సినిమా రూ.50 కోట్లు కూడా సాధించని టైమ్‌లో వంద కోట్లకు మించిన బడ్జెట్‌తో ఈ సినిమాని ఓ ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. దర్శకుడిగా ఓ సాహసం చేశారు. అదే భారతీయ సినిమా రూపరేఖల్ని ప్రపంచ పటంలో సమూలంగా మార్చివేసింది. తెలుగు సినిమా అంటే ప్రపంచ సినిమా ఆశ్చర్యంగా తలెత్తి చూసేలా చేసింది. దీనికి కొనసాగింపుగా చేసిన 'బాహుబలి 2' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద, వరల్డ్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమా అంటే ఇదని నిరూపించింది. ఈ సిరీస్ సినిమాల తరువాతే తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా అంటున్నాంటే అది జక్కన్న ఘనతే. 'ఆర్ ఆర్ ఆర్'తో ఊహించని అద్భుతాన్నిసృష్టించారు.
అందని ద్రాక్షగా మారిన ఆస్కార్‌ని సైతం అందించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. త్వరలో మహేష్ బాబుతో తెరపైకి తీసుకురాబోతున్న ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమా కీర్తి పతాకాన్ని హాలీవుడ్ యవనికిపై సగర్వంగా ఎగురవేయబోతున్నారు. భారతీయ సినిమాకు కీర్త ప్రతిష్టలని తెచ్చిపెట్టి తలెత్తుకునేలా చేసి దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో పాన్ ఇండియా స్థాయికి మించి బ్లాక్ బస్టర్లని దక్కించుకోవాలని కోరుకుంటూ ఆయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది