మారిన హీరోయిజంపై లెజెండరీ లిరిసిస్ట్ కామెంట్
నాటితో పోలిస్తే.. ఈరోజుల్లో సినిమా తీరుతెన్నులు మారిపోయాయని అన్నారు ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్.
నేటి సినిమా కథలు, హీరోయిజం అమాంతం మారాయని, 1960ల నాటి సినిమాల హీరో నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చారని.. నాటితో పోలిస్తే.. ఈరోజుల్లో సినిమా తీరుతెన్నులు మారిపోయాయని అన్నారు ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్. నాటి హీరోలు సామాన్యులుగా ఉండేవారు. టాక్సీ డ్రైవర్, రిక్షా పుల్లర్, కార్మికుడు లేదా ఉపాధ్యాయుడిగా హీరోలను చూపించారు. నేటి హీరోలు సంపన్న కుటుంబాలకు చెందినవారుగా తెరపై కనిపిస్తున్నారు. దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులతో నేటి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి నేటి సినిమాలు మెజారిటీ భాగం రాజకీయ ఇతివృత్తాలు లేదా సామాజిక సమస్యలను ప్రతిబింబించడం లేదు. వ్యక్తిగత కథలను మాత్రమే తెరకెక్కించి ఆనందిస్తున్నారు అని అన్నారు.
స్వభాష ప్రాముఖ్యత గురించి జావేద్ అక్తర్ ప్రస్థావించారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. అది సంస్కృతి అనే నీటితో ప్రవహించే నది అని అక్తర్ అన్నారు. ప్రజలను వారి భాష నుండి వేరు చేయడం అంటే చెట్టు మూలాలను కత్తిరించినట్లే. మనం మన భాషను కోల్పోతే మన సంస్కృతిని, కథలను కూడా కోల్పోతాము. కానీ దురదృష్టవశాత్తు నేడు భాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వ్యక్తులు దాని గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు... అని వ్యాఖ్యానించారు.
9వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జావేద్ అక్తర్‌కు పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. అలాగే ఎల్లోరా గుహల ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని సందర్శించిన అనుభవాన్ని అక్తర్ ఈ వేదికపై వివరించారు. "ఎల్లోరా గుహలలోని అద్భుతమైన శిల్పాలను వీక్షించాక నేను చాలా చలించిపోయాను. నేను ఇంతకు ముందు ఈ ప్రదేశానికి ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉంది. ఈ మంత్రముగ్ధులను చేసే కళాఖండాన్ని సృష్టించిన వ్యక్తులు డబ్బు కోసం కాకుండా అభిరుచితో దీనిని రూపొందించారని నేను కచ్చితంగా చెప్పగలను. తరాల తర్వాత తరాలు ఈ అభిరుచిని కొనసాగించాయి. మనం ఇలా చేయలేము.. వారి నిబద్ధత అంకితభావాన్ని అర్థం చేసుకోవాలి. నాటి ప్రజల అభిరుచి పట్టుదలలో వెయ్యో వంతు అయినా మనం గ్రహించగలిగితే మనం ఈ దేశాన్ని స్వర్గంగా మారుస్తాము.. అని అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు అనుభవ్ సిన్హా, ఏఐఎఫ్‌ఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ నందకిషోర్ కగ్లీవాల్, ఎంజీఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విలాస్ సప్కల్, ఫెస్టివల్ డైరెక్టర్ అశోక్ రాణే, ఆర్టిస్టిక్ డైరెక్టర్ చంద్రకాంత్ కులకర్ణి, కన్వీనర్ నీలేష్ రౌత్, కవి దాసు వైద్య సహా ప్రముఖులు పాల్గొన్న సభలో జావేద్ అక్తర్ వ్యాఖ్యానం అందరినీ ఆకర్షించింది.
ఇదే వేదికపై బాల్కీ మాస్టర్‌క్లాస్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. అనేక ప్రశంసలు పొందిన చిత్రాలను ఈ వేదికపై ప్రదర్శించారు. 9వ అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రెండవ రోజున కూడా ఆసక్తికరమైన ఈవెంట్లతో రక్తి కట్టించింది. పా, చిని కమ్, ఘుమర్, షమితాబ్, ప్యాడ్‌మాన్ వంటి చిత్రాల దర్శకుడు ఆర్. బాల్కీ మాస్టర్ క్లాస్ హైలైట్ గా నిలిచింది. మాస్టర్‌క్లాస్‌కు సినీరంగంలో ఔత్సాహిక విద్యార్థులు, చలనచిత్ర ఔత్సాహికులు.. చలనచిత్ర ప్రేమికుల నుండి అధిక స్పందన లభించింది. మాస్టర్ క్లాస్‌ని దర్శకుడు ద్యానేష్ జోటింగ్ మోడరేట్ చేశారు. అంతకు ముందు ఆర్ బాల్కీ ఘుమర్ అనే సినిమాని తెరకెక్కించారు.