రాజమౌళి డ్యాన్స్.. మహేష్ మీద జోక్స్

ఇదే సందర్భంలో రాజమౌళి డ్యాన్స్ మీద జోకులు కూడా బాగానే పేలుతున్నాయి. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై రెండున్నరేళ్లు దాటిపోయింది

Update: 2024-12-17 21:30 GMT

దర్శక ధీరుడు రాజమౌళిలో కొత్త టాలెంట్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తన కొడుకు సింహా కోడూరి పెళ్లిలో ఆయన రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకతుముందే ఒక కుటుంబ వేడుకలో అదిరిపోయే స్టెప్పులతో ఆశ్చర్యపరిచిన జక్కన్న.. ఈసారి మరింత పర్ఫెక్షన్ చూపించాడు. సంగీత్ వేడుకలో భార్యతో కలిసి సూపర్ స్టెప్స్ వేసిన ఆయన.. పెళ్లి వేడుక మధ్యలో ఊర మాస్ డ్యాన్సులతో ఆశ్చర్యానికి గురి చేశాడు. రాజమౌళి స్థాయి దర్శకుడు ఇలా ఒళ్లు మరిచి ఊర మాస్‌గా డ్యాన్స్ చేయడం పెద్ద షాక్. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో రాజమౌళినే చూసి నేర్చుకోవాలని.. ఎంత పెద్ద దర్శకుడైనా సగటు వ్యక్తినే అని మరిచిపోకుండా రాజమౌళి కొడుకు పెళ్లిని ఆస్వాదిస్తున్న వైనం సూపర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సందర్భంలో రాజమౌళి డ్యాన్స్ మీద జోకులు కూడా బాగానే పేలుతున్నాయి. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై రెండున్నరేళ్లు దాటిపోయింది. మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో ఓకే అయినా.. స్క్రిప్టు కూడా రెడీ అయినా.. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. మహేష్ ఈ సినిమా కోసం ఏడాది నుంచి ప్రిపేరవుతున్నాడు. కానీ ఎంతకీ షూటింగ్ మొదలు కావడం లేదు. ఇది మహేష్ అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి.. మహేష్ సినిమా పని వదిలేసి ఫ్యామిలీ ఈవెంట్లలో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఫన్నీ మీమ్స్ తయారు చేస్తున్నారు నెటిజన్లు. మహేష్ అక్కడ వెయిటింగ్‌లో ఉంటే.. జక్కన్న ఇలా డ్యాన్సులేస్తున్నాడంటూ.. అనేక సినిమా సన్నివేశాలను జోడిస్తూ మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు. మహేష్ రాజమౌళి సినిమా కోసం ఇలా వెయిట్ చేస్తూనే షష్టిపూర్తి కూడా చేసుకుంటాడని.. ఆ ఈవెంట్లోనూ జక్కన్న డ్యాన్స్ చేస్తాడంటూ ‘కలిసుందాం రా’ సినిమాలోని పాటతో చేసిన మీమ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. వీటిని మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ సరదాగానే తీసుకుంటున్నారు.

Tags:    

Similar News