చందమామ ఒత్తిడికి ఇలా గురవుతుందా?
మదర్ గా ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కుంటున్నారంటే? ఆసక్తికర విషయాలు పంచుకుంది.
చందమామ కాజల్ అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే మరోవైపు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. పెళ్లి చేసుకున్నా..ఓ బిడ్డకు తల్లైనా కాజల్ దూకుడు మాత్రం ఏం తగ్గలేదు. ఆ రెండింటితో సంబంధం లేకుండా కొత్త ఛాన్సులు అందుకుంటుంది. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. మదర్ గా ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కుంటున్నారంటే? ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే..
'పిల్లలు పుట్టిన తర్వాత ఒక మహిళ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముందుగా తన జీవితం మారిపోయిందనే విషయాన్ని గమనించాలి. దానిని అంగీకరించాలి. ఇదొక పెద్ద సవాల్. ఆ తర్వాత పిల్లల అవసరాలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ, వారికి అవసరమైనవి గుర్తుంచుకొంటూ ఉండాలి. ఇవి సహజంగానే కొంత ఆందోళన , ఒత్తిడి కలిగిస్తాయి. అంతే కాదు. నాకు తెలిసి వర్కింగ్ యంగ్ మదర్స్‌లో కొంత గిల్ట్ ఉంటుంది. పనికి వెళ్లినప్పుడు.. బేబీని సరిగ్గా చూసుకోవటం లేదనే గిల్ట్.
బేబీతో సమయం గడుపుతున్నప్పుడు... పని ఎగ్గొడుతున్నామనే గిల్ట్. ఈ భావోద్వేగాల సయ్యాటలో ఏర్పడే సందిగ్ధత పెద్ద సవాల్‌గా మారుతుంది. నాకైతే రోజుకు 24 గంటలు చాలవనిపిస్తోంది. డే లో ఇంకొన్ని గంటలు అదనంగా ఉంటే సినిమాలకు...బిడ్డకు సమయం కేటాయించొచ్చు కదా అనిపిస్తుంది. కానీ మనకు ఆ ఛాన్స్ లేదు. నా చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఈ రకమైన సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. మా ఆయన మంచి ఆర్గనైజర్.
నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటున్నా. గతంలో కేవలం నా జీవితాన్ని, నా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకుంటే సరిపోయేది. మిగిలినవారు నా షెడ్యూల్స్ ఆధారంగా ప్లాన్ చేసుకొనేవారు. కానీ ఇప్పుడు నేను నా షెడ్యూల్స్ మాత్రమే కాదు, పిల్లాడినీ, కుటుంబాన్నీ చూసుకోవాలి. దీనికోసం కనీసం రెండు వారాల ముందే నా షెడ్యూల్స్ అన్నీ ఫిక్స్ చేసుకొంటున్నా` అని తెలిపింది. ప్రస్తుతం కాజల్ హిదీ..తెలుగు..తమిళ్ మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. `ఇండియన్ -2` లో కమల్ హాసన్ కి జోడీగా నటిస్తోంది. `ఉమా` అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం `సత్యభామ` రిలీజ్ కి రెడీ గా ఉంది.