ఈ రికార్డు బుజ్జి స్పీడ్ కంటే వేగంగా బద్ధలైంది
ఏపీ, తెలంగాణ సహా తమిళనాడులోను చక్కని వసూళ్లను సాధించిన కల్కి ఓవర్సీస్ లోను సంతృప్తికరమైన ఫలితం అందుకుందని ట్రేడ్ చెబుతోంది.
ప్రభాస్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా రికార్డుల్లో నిలుస్తోంది 'కల్కి 2989 ఎడి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచి పాజిటివ్ సమీక్షలతో అద్భుత వసూళ్లను సాధించింది కల్కి. తొలి నాలుగు రోజుల్లోనే 500కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగుపెట్టింది. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడులోను చక్కని వసూళ్లను సాధించిన కల్కి ఓవర్సీస్ లోను సంతృప్తికరమైన ఫలితం అందుకుందని ట్రేడ్ చెబుతోంది.
ఇదిలా ఉంటే.. కల్కి చిత్రం సూపర్ స్టార్ మహేష్ -నమ్రతలకు చెందిన ఏఎంబి సినిమాస్‌లో అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకూ అత్యంత వేగంగా కోటి రూపాయల వసూళ్ల క్లబ్ లో చేరిన సినిమాగా `కల్కి 2989 ఎడి` రికార్డులకెక్కింది. దీంతో ఏఎంబి సినిమాస్ అధికారిక ఇన్ స్టాలో ఈ విషయాన్ని షేర్ చేసారు.
''ఈ రికార్డు బుజ్జి స్పీడ్ కంటే వేగంగా బద్దలైంది... #కల్కి 2898AD మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్‌గా ఏకం చేసింది. వారాంతంలో #AMB సినిమాస్‌లో రూ.1 కోటి యూనిట్లను దాటింది...'' అని తెలియజేసారు. మీరు ఇంతవరకు ఈ కళాఖండాన్ని చూశారా?.. అంటూ ఏఎంబీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం ఆసక్తిని కలిగించింది.
ఏడు రోజుల వసూళ్లు:
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' ఏడు రోజుల రన్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.392.9 కోట్లు వసూలు చేసిందని సాక్‌నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లు రాబట్టింది. కల్కి 2898 AD ప్రారంభ రోజున .. అంటే గురువారం రూ.95.3 కోట్లు సంపాదించింది. ఇది శుక్రవారం నాడు రూ.59.3 కోట్లను ఆర్జించి, శనివారం రూ.66.2 కోట్లకు చేరుకుంది. ఆదివారం కలెక్షన్స్ మరింత పుంజుకున్నాయి. మేకర్స్ రూ88.2 కోట్లు సంపాదించింది. సోమవారం మళ్లీ రూ.34.15 కోట్లకు తగ్గింది.. మంగళవారం కల్కి 2898 AD రూ.27.05 కోట్లు రాబట్టింది. బుధవారం ఈ సినిమా రూ.22.7 కోట్లు రాబట్టింది. మొత్తం రూ392.9 కోట్ల దేశీయ వసూళ్లకు చేరుకుంది.