ట్రెండీ టాక్: 69 వ‌య‌సు ప్ర‌యోగ‌శాల

ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం చూడాల‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Update: 2024-06-12 16:30 GMT

క‌మ‌ల్ హాస‌న్ అంటే ప్ర‌యోగం.. ప్ర‌యోగం అంటే క‌మ‌ల్ హాస‌న్! అందుకే ఆయ‌న‌ను ఉలగనాయగన్ (విశ్వ‌ నటుడు) అని పిలుస్తారు. 69 ఏళ్ల వయసులో కూడా తనవైన పాత్ర‌ల‌ ఎంపికలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ 'కల్కి 2898 AD' ట్రైల‌ర్ లో వీక్షించిన అనంత‌రం క‌మ‌ల్ పాత్ర గురించి స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ పెరిగింది. నాగ్ అశ్విన్ తెలివిగా ఈ ట్రైల‌ర్ లో కేవ‌లం క‌మ‌ల్ వేష‌ధార‌ణను మాత్ర‌మే రివీల్ చేసాడు. అత‌డి పాత్ర ఎలాంటిది? అన్న‌ది ఎక్క‌డా చూపించ‌లేదు. కానీ క్యూరియాసిటీని పెంచాడు. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం చూడాల‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

దశావతారంలో 10 పాత్ర‌ల్లో న‌టించిన క‌మ‌ల్ అంత‌కుముందు ఆ త‌ర్వాతా కూడా అదే తీరుగా ప్ర‌యోగాల బాట‌లోనే ఉన్నాడు. అత‌డు నిరంత‌ర ప్ర‌యోగ‌శీలి. తాను ఎంచుకునే పాత్ర‌ల‌తోనే అత‌డు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. ఐదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన క‌మ‌ల్ త‌న కెరీర్ లో చేయ‌ని ప్ర‌యోగం లేదు. అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను పోషించాడు. ఆయన చేయని పాత్ర ఉండకపోవచ్చనే చెప్పాలి. కానీ 69 వ‌య‌సులోను కమల్ హాసన్ లో ఆకలి తీరడం లేదు. అత‌డి లైన‌ప్‌లో ఉన్న సినిమాల్ని ప‌రిశీలిస్తే ఈ విష‌యం అవ‌గ‌త‌మ‌వుతుంది.

జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'భారతీయుడు 2'లో క‌మ‌ల్ పాత్ర గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇందులో సేనాప‌తిగా అత‌డు అవినీతిప‌రుల భ‌ర‌తం ప‌ట్ట‌నున్నాడు. 1996లో విడుదలైన భార‌తీయుడుకి సీక్వెల్ కావ‌డంతో భార‌తీయుడు 2 పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కమల్ హాసన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా తిరిగి వచ్చారు. భార‌తీయుడు లాంటి క్లాసిక్ హిట్ కి సీక్వెల్ తీయాల‌నుకోవ‌డం అందులో న‌టించ‌డం రెండూ సాహ‌స‌మే. కానీ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కు గ‌ట్స్ ఉన్నాయ‌ని నిరూపిస్తున్నారు.

అలాగే మ‌ణిర‌త్నంతో థ‌గ్ లైఫ్ కూడా క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ లో మ‌రో భారీ ప్ర‌యోగం. 2022లో 'విక్రమ్'తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న కమల్ హాసన్‌కి వ‌రుస‌గా సినిమాలున్నా ఇప్ప‌టివ‌ర‌కూ ఇంకా విడుదల ఏదీ లేదు. అయితే దాదాపు 35 ఏళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో మరోసారి కలిశాడు. వీరిద్దరూ కలిసి భారతదేశంలోని వృత్తిపరమైన దొంగలు హంతకులపై 'థగ్ లైఫ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

నిజానికి క‌మ‌ల్ 'థగ్ లైఫ్' అనౌన్స్‌మెంట్ వీడియో మెస్మరైజింగ్‌. నాయ‌కుడు (నాయ‌క‌న్) కాంబినేష‌న్ నుంచి మ‌రో భారీ ప్ర‌యోగానికి తెర లేచింది. క‌మల్ హాసన్ లుక్, అతడి డైలాగ్ డెలివరీ ప్ర‌తిదీ యూనిక్ గా క‌నిపించాయి. థగ్ లైఫ్ ఈ ఏడాది తమిళ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. కేవలం కొన్ని సెక‌న్ల‌ ప్రకటన వీడియోతో అంత పెద్ద‌ ప్రభావాన్ని సృష్టించగలిగారు. 'కల్కి 2898 AD'లో కమల్ హాసన్ అతిధి పాత్రలో కనిపించినప్పటికీ ఇది ఇప్పటికీ సినిమా గమనాన్ని మార్చగల పాత్ర. సినిమాల్లో ఆరు దశాబ్దాలు గడిచినా ఇంకా కమల్ హాసన్ తన కోసమే కాకుండా సినిమా కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.

Tags:    

Similar News