స్వదేశాన్ని వెన్నుపోటు పొడిచే స్టార్లు వీళ్లు: కంగ‌న‌

కొన్ని సంద‌ర్భాల్లో వారి గుణ‌గ‌ణాల‌ను విప‌రీతంగా పొగిడేసిన‌ కంగ‌న స‌ద‌రు స్టార్లు చేసే త‌ప్పుల‌ను కూడా అంతే ఇదిగా బెరుకు లేకుండా ఎత్తి చూపుతోంది.

Update: 2024-09-18 21:30 GMT

వివాదాల‌తో అంట‌కాగ‌డం కంగ‌న‌కు కొత్తేమీ కాదు. నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌తో హెడ్ లైన్స్ లో నిలుస్తుంటుంది. ఇక బాలీవుడ్ లో టాప్ హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను సైతం ఢీకొట్టేందుకు ఈ భామ వెన‌కాడ‌దు. ఖాన్ ల త్ర‌యంతో స్నేహం కొన‌సాగిస్తూనే, వీలున్న‌ప్పుడు వారు చేసే ప‌నుల‌ను వేలెత్తి చూప‌డంలోను కంగ‌న ముందుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో వారి గుణ‌గ‌ణాల‌ను విప‌రీతంగా పొగిడేసిన‌ కంగ‌న స‌ద‌రు స్టార్లు చేసే త‌ప్పుల‌ను కూడా అంతే ఇదిగా బెరుకు లేకుండా ఎత్తి చూపుతోంది.

కంగనా రనౌత్ సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ''న్యూస్ 18 ఇండియా చౌపాల్'' కార్యక్రమానికి హాజరైనప్పుడు, పొగాకును ఆమోదించే నటులపై తీవ్రంగా విరుచుకుపడింది. అలాంటి సెల‌బ్రిటీలు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కంగన బాలీవుడ్ స్టార్ల ఇత‌ర‌ వ్యాపకాల‌ను ప్రశ్నించింది. వారు స్వదేశాన్ని వెన్నుపోటు పొడిచే విషయంలో ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. ''బాలీవుడ్ మన దేశాన్ని నాశనం చేసింది. వారు దానికి బాధ్యత తీసుకోవాలి. ఈ నటులు వారి నికర ఆస్తుల‌ విలువను బ‌హిరంగంగా చెబుతారు.. పొగాకు ఉత్ప‌త్తికి ప్ర‌చారం చేస్తుంటారు. వారు తెరపై పొగాకు నమలడం ముగించాక మ‌ళ్లీ దాని జోలికి వెళ్ల‌రు. దేశ వ్యతిరేక ఎజెండా విషయంలో ఈ వ్యక్తులు కలిసి నిలబడతారు. డబ్బు కోసం మన దేశాన్ని వెన్నుపోటు పొడిచారు. ఇన్‌స్టాగ్రామ్ కథనాలు లేదా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడానికి వారు రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తారు!'' అని కంగనా తెలిపింది. కంగ‌న వ్యాఖ్య‌ల‌ను బట్టి ఇటీవ‌ల పొగాకు ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేసిన షారూఖ్‌, అక్ష‌య్ వంటి వారిని ప‌రోక్షంగా విమ‌ర్శించింద‌ని అర్థ‌మ‌వుతోంది.

తమ సినిమాల్లో విలన్‌లను హీరోలుగా చూపించడంపై బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలను కంగనా ప్రశ్నించింది. వారు చేసే సినిమాలు ఇప్పుడు నాయక్, ఖల్‌నాయక్‌గా మారాయి. వారి హీరోలు గూండాలు, వారు మహిళలను వెంబడిస్తారు.. ఆటపట్టిస్తారు.. వారిపై అత్యాచారం చేస్తారు. వారు తమ సంస్కృతి కోసం నిలబడరు. అలాంటి వారంతా హీరోలు.. అంటూ కంగ‌న విమ‌ర్శించింది. రణబీర్ కపూర్‌ను 'సీరియల్ స్కర్ట్ ఛేజర్' అని కామెంట్ చేయ‌డం గురించి ప్ర‌శ్నించ‌గా, కంగనా హోస్ట్‌ను అడ్డుకుని...''మీలో కొంద‌రు సాధువులు.. వారి కోసం వాదిస్తున్నారు'' అని వ్యాఖ్యానించింది.

కంగనా త‌న‌ చిత్రం 'ఎమర్జెన్సీ'పై అలుముకున్న‌ వివాదం గురించి కూడా మాట్లాడింది. తన సినిమాపై కొంతమందికి మాత్రమే అభ్యంతరం ఉందని అన్నారు. ఎమ‌ర్జెన్సీ రిలీజ్ ని అడ్డుకున్న‌ భింద్రన్‌వాలేను సమర్థిస్తున్న వారి గురించి ప్రశ్నించగా.. ''అతడు సాధువు కాదు.. ఉగ్రవాది'' అని అని వ్యాఖ్యానించింది. నా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందింది. నలుగురు చరిత్రకారులు మా సినిమాలను పర్యవేక్షించారు. మా వద్ద సరైన పత్రాలు ఉన్నాయి. నా సినిమాలో తప్పేమీ లేదు. కానీ కొంతమంది భింద్రన్‌వాలేను సాధువు, విప్లవకారుడు లేదా నాయకుడు అని పిలుస్తారు. వారు నా సినిమాను నిషేధించాలని బెదిరించారు. నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత ప్రభుత్వాలు ఖలిస్తానీలను ఉగ్రవాదులుగా ప్రకటించాయి. అతడు ఏకే 47తో గుడిలో కూర్చున్న సాధువు కాదు! అని కంగ‌న వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News