కంగ‌న గెలుపు.. మాట‌ల్లోనే కాదు చేత‌ల్లోనూ దూకుడు

బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ కి నోటి దురుసు ఎక్కువ‌ అంటూ ప్ర‌చారం ఉంది.

Update: 2024-06-05 05:24 GMT

బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ కి నోటి దురుసు ఎక్కువ‌ అంటూ ప్ర‌చారం ఉంది. రాజ‌కీయాల్లోకి రాక ముందు ప‌లువురు సినీప్ర‌ముఖులు, రాజకీయ నాయ‌కుల‌పై కంగ‌న నోరు పారేసుకోవ‌డం, అటుపై కోర్టు వివాదాల గురించి తెలిసిందే. అయితే భాజ‌పా త‌ర‌పున మండి (హ‌మ‌చ‌ల్ ప్ర‌దేశ్) నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తోంద‌ని ఖ‌రారైన త‌ర్వాత కూడా కంగ‌న అదే దూకుడు కొన‌సాగించింది. వేదిక‌ల‌పై త‌న‌దైన శైలిలో నోటికి ప‌ని చెప్పింది. కానీ మాట తీరుతోనే కాదు చేత‌ల్లోను స‌త్తా చాటుతాన‌ని ఇప్పుడు నిరూపించింది.

వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా కాంగ్రెస్ ని తూల‌నాడుతూ భాజ‌పా అభ్య‌ర్థి అయిన‌ కంగన ర‌నౌత్ ప్ర‌సంగాలు మండి ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి 72,088 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై విజయం సాధించారు. ఈ గెలుపు అద్భుతం. క్వీన్ కంగ‌న స్టార్ ప‌వ‌ర్ క‌లిసొచ్చింది. పైగా మండి త‌న స్వ‌స్థ‌లం కావ‌డంతో కంగ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క అయింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పురాతన దేవాలయాలతో గొప్ప సాంస్కృతిక ప్ర‌త్యేక‌త క‌లిగిన ప్ర‌దేశం. ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఇక్క‌డ‌ రాజకుటుంబాలనుంచి అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌లు ఎన్నుకోవడంలో ముందుంటారు. భౌగోళికంగా హిమాచల్ ప్రదేశ్‌లో అతిపెద్ద నియోజకవర్గం ఇది.

మండి గ‌త‌ ఎన్నికలు రిపోర్ట్స్:

గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మండి లోక్ సభ స్థానం గత రెండు ఎన్నికల్లో బీజేపీ వైపు మళ్లింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో, బిజెపికి చెందిన రామ్ స్వరూప్ శర్మ 39,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా సింగ్‌పై రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలలో రామ్ స్వరూప్ శర్మ 647,189 ఓట్లను పొంది గణనీయమైన తేడాతో సీటును నిలుపుకున్నారు.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో దివంగత ఎంపీ రామ్ శర్మ భార్య ప్రతిభ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే మండిలో కంగనా విజయం కేవలం మోడీ ప్రభావమే కారణమని స్థానికులు విశ్వసించారు. కంగ‌న స్టార్ ప‌వ‌ర్ త‌న‌కు అద‌న‌పు అస్సెట్ అయింది.

Tags:    

Similar News